AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana DGP 2021 Review: నేర రహిత తెలంగాణే లక్ష్యం.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ మహేందర్ రెడ్డి..

Telangana DGP 2021 Review: తెలంగాణ రాష్ట్రాన్ని నేర‌ ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దడ‌మే ల‌క్ష్యం అని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. శాంతిభ‌ద్రత‌ల ప‌రిరక్షణ‌లో పోలీసు శాఖ స‌ఫ‌లీకృత‌మైంది

Telangana DGP 2021 Review: నేర రహిత తెలంగాణే లక్ష్యం.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ మహేందర్ రెడ్డి..
Mahender Reddy
Shiva Prajapati
|

Updated on: Dec 31, 2021 | 4:58 PM

Share

Telangana DGP 2021 Review: తెలంగాణ రాష్ట్రాన్ని నేర‌ ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దడ‌మే ల‌క్ష్యం అని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. శాంతిభ‌ద్రత‌ల ప‌రిరక్షణ‌లో పోలీసు శాఖ స‌ఫ‌లీకృత‌మైంది పేర్కొన్నారు. శుక్రవారం నాడు డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక -2021ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేశారని, ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్ర పోలీసుల‌కు 11 జాతీయ అవార్డులు వ‌చ్చాయ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, నేరగాళ్లను పట్టుకోవడంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. అయితే, గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.65 శాతం నేరాలు పెరిగాయని పోలీస్ బాస్ వెల్లడించారు. 50.3 శాతం కేసుల్లో నేర‌గాళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వీటిలో 80 కేసుల్లో 126 మందికి జీవిత‌ఖైదు ప‌డిందన్నారు. 664 మంది నేర‌గాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీని కోసం ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేసి, నేరగాళ్ల డేటా ఒకే పోర్టల్‌లో ఉంచడంతో ఇతర రాష్ట్రాలు కూడా నిందితులను గుర్తించేలా చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 8 లక్షలకుపైగా సీసీటీవీలను ఏర్పాటు చేశామని చెప్పిన డీజీపీ.. దీనివల్ల చాలా కేసులను పరిష్కరించగలిగామన్నారు. సీసీటీవీల వల్ల 22 వేల 600 కేసులను పరిష్కరించగలిగామన్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 800 పోలీసు స్టేష‌న్లలో రిసెప్షన్ కౌంట‌ర్లు ప్రారంభించామ‌ని డీజీపీ తెలిపారు. షీ టీమ్స్ 5,145 ఫిర్యాదులు స్వీక‌రించి భ‌రోసా క‌ల్పించాయన్నారు. హాక్ ఐ ద్వారా 83 వేల‌కు పైగా ఫిర్యాదులు స్వీక‌రించామని చెప్పారు. ఈ ఏడాది 8,828 సైబ‌ర్ నేరాలు న‌మోదు అయ్యాయని వెల్లడించిన ఆయన.. రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌పై రూ. 879 కోట్లు జ‌రిమానా విధించామన్నారు.

ఇదే సమయంలో మావోయిస్టుల కదలికలపైనా డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. మావో రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దుతామన్నారు. మావోయిస్టుల రాక‌పోక‌ల క‌ట్టడిలో స‌మ‌ర్థంగా ప‌ని చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది 98 మంది మావోయిస్టుల‌ను అరెస్టు చేశామని, 133 మంది మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్రవంతిలో క‌లిశారని వెల్లడించారు. రాష్ట్రంలో మ‌త ఘ‌ర్షణ‌లు లేకుండా ప్రశాంత వాతావ‌ర‌ణం ఉండేలా చ‌ర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడేండ్లుగా ఎలాంటి మ‌త ఘ‌ర్షణ‌లు జ‌ర‌గ‌లేదన్నారు. ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడ‌వ‌లు జ‌రిగాయని డీజీపీ వివరించారు.

Also read:

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. గుర్తించండి చూద్దాం.. కనిపెడితే మీరు గ్రేటే.!

పండ్లు తింటే ప్రయోజనమే కాదు నష్టాలు కూడా..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..?

Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు