AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల మేనిఫెస్టోపై టీ కాంగ్రెస్ కసరత్తు.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందించాలని..

Telangana Congress: విజయ భేరి బహిరంగ సభలో ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి మేనిఫెస్టోని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోని డిజైన్ చేయబోతున్నారు. ఇందు కోసం సమావేశమైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. అన్ని వర్గాల..

Telangana: ఎన్నికల మేనిఫెస్టోపై టీ కాంగ్రెస్ కసరత్తు.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందించాలని..
TPCC Manifesto Committee Meet
Sravan Kumar B
| Edited By: |

Updated on: Sep 30, 2023 | 9:23 PM

Share

తెలంగాణ, సెప్టెంబర్ 30: టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సమక్షంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. విజయ భేరి బహిరంగ సభలో ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి మేనిఫెస్టోని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోని డిజైన్ చేయబోతున్నారు. ఇందుకోసం సమావేశమైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా మేనిఫెస్టో ఉండబోతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్థితిగతులను తెలుసుకొని వాస్తవికత ఆధారంగానే మేనిఫెస్టో డిజైన్ ఉంటుందని, ఆ విధంగానే డిజైన్ చేయాలని నిర్ణయించారు. గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన ఉదయం అదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు మానిఫెస్టో కమిటీ సభ్యులు. యువతను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తోంది. యువతను తమ వైపు తిప్పుకుంటే కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలనే నిర్ణయం కూడా తీసుకుంది కమిటీ.

ఇక మధ్యతరగతి దిగువ, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకుంటే ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉపయోయోగ పడేలా ఒక మంచి సంక్షేమ పథకాన్ని రూపొందించాలని నిర్ణయించింది మ్యానిఫెస్టో కమిటీ. త్వరలో ఇతర వర్గాలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పథకాల రూపకల్పన చేసే విధంగా టీ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అలాగే సీఆర్పీఎఫ్ మాజీ సైనిక ఉద్యోగుల నుంచి చైర్మన్ దుదిల్ల శ్రీధర్ బాబుకు అందిన వినతి పత్రం మేరకు.. దేశం కోసం సేవలు చేసిన సైనికుల సేవలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ భావిస్తోంది.

కాగా, ఐదు హామీలతోనే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అప్లై చేయాలనే యోచనతో ఆరు హామీలను ప్రకటించి ఎన్నికల నగారా మోగించింది. అర్హులైన మహిళలకు 2500 రూపాయల గ్యాస్ సిలిండర్‌ని రూ 500 లకు,  రాష్ట్రవ్యాప్తంగా టిఎస్ఆర్టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఎకరాకి 15 వేల రూపాయలు, కౌలు రైతులకు 12 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. దానికి తోడు కచ్చితంగా ఎన్నికల్లో గెలిచే మ్యానిఫెస్టోని డిజైన్ చేయటానికి కసరత్తు చేయాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది.