Nirmal: వేద పాఠశాల సమీపాన నిర్మానుష్య ప్రదేశం.. దూరంగా అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
అసలింతకూ బాసర వేధపాఠశాలలో ఏం జరుగుతుంది..? బాలుడి గాయాలకు కారణం ఏంటి.? ఘటన జరిగిన సమయంలోని సీసీ పుటేజీ మాయమవడంతో పలు అనుమానాలు తావిస్తోంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి ఇక్కడ..

నిర్మల్ జిల్లా బాసరలోని ఓ ప్రైవేట్ వేధ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మూడవ తరగతి చదువుతున్న 11 బాలుడు రక్తపుమడుగులో పడి ఉండటం.. స్థానికులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇవ్వడం సంచలనంగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన వేద పాఠశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం కలకలం రేపుతోంది. అయితే బాలుడిపై కొండముచ్చులు దాడులు చేశాయని స్కూల్ యాజమాన్యం చెప్పుకొస్తుంటే.. బాధితుడి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిపై హత్యాయత్నం జరిగిందంటున్నారు. ప్రమాద సమయంలో సీసీ కెమెరాలు పని చేయకుండాపోవడం తమ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయంటున్నారు బాలుడి తల్లిదండ్రులు.
ఆధ్యాత్మికత, దైవ భక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో బాసరలో వేదభారతి పాఠశాలను గత దశాబ్దకాలంగా నిర్వహిస్తున్నారు కొందరు ప్రైవేట్ వ్యక్తులు. నిత్యం భక్తి పారవశ్యంలో మునిగితేలే ఈ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడం.. తీవ్ర కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితం రాత్రి వేద పాఠశాల సమీపంలోని ఓ పాడుబడ్డ మరుగుదొడ్డి వద్ద 11 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ స్థానికుల కంటపడ్డాడు. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా భైంసాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అయితే సదరు బాలుడు తూఫ్రాన్‌కు చెందిన లోహిత్(11)గా గుర్తించిన యాజమాన్యం కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు సీసీటీవీ పుటేజీ పరిశీలించారు. అయితే ఆ టైంలో సీసీ పుటేజీ పని చేయకపోవడంతో పలు అనుమానాలు తెర మీదకొస్తున్నాయి.
రెండు రోజుల క్రితం గురువారం రోజు రాత్రి ఉరుములు, మెరుపులతో బాసరలో భారీ వర్షం కురిసింది. ఆ రాత్రి బాధితుడు లోహిత్ గదిలో కాకుండా హాల్‌లో నిద్రపోయాడు. అర్థరాత్రి సమయంలో బయటకు వెళ్లిన లోహిత్ ఎంతసేపటికి తిరిగిరాలేదు. ఉదయం సమీపంలోని మరుగుదొడ్ల వద్ద తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు లోహిత్. గుర్తించిన స్థానికులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అయితే కొండముచ్చుల దాడిలో లోహిత్ గాయాలపాలైనట్లు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. కానీ బాలుడి తలపై మాత్రమే గాయాలు ఉండడం.. శరీర భాగాలపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుతుంది. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
అయితే తమ కుమారుడిని ఎవరో పదునైనా ఆయుధాలతో దాడి చేసి ఉంటారని, కొండ ముచ్చుల దాడిలో గాయపడినట్లు అనవాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన బాలుడిని ఎవరో కక్ష్య గట్టి మరీ హత్యయత్నం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండముచ్చులు దాడి చేశాయనడానికి ఎలాంటి ఆధారాలు వేదపాఠశాల వద్ద లేవని.. అసలు బాలుడు లోహిత్ బయటకు వెళ్లిన సమయం నుండి సీసీ పుటేజ్ మాయమైందని.. లోహిత్ పై దాడి కుట్ర కోణం దాగుందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తుచేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
వేద పాఠశాల విద్యార్థి ఘటనపై రంగంలోకి దిగిన నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల.. ఘటన స్థలాన్ని పరిశీలించి వేద పాఠశాల నిర్వహకుల నుండి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి గాయాలకు కారణం ప్రమాదమా.. లేక హత్యాయత్నమా.. ఒక వేళ హత్యాయత్నమే అయితే బాలుడి పై దాడి చేయాల్సిన అవసరంఎవరికి ఉంది. ప్రమాదమే అయితే కారణాలేంటి అని ఆరా తీస్తున్నారు ఎస్పీ జానకీ షర్మిల. సిసి పుటేజ్ మాయమైన ఘటనపై సైతం ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.