Telangana: తొలి రోజు స్కూల్‌కు వచ్చిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ సర్‌ప్రైజ్.. పూల బొకేలతో స్వాగతం.. అవాక్కైన విద్యార్థులు!
సాధారణంగా పాఠశాలలు తిరిగి తెరిచే సమయంలో విద్యార్థుల్లో ఒక రకమైన ఉత్సాహం, మరి కొంతమందిలో తెలియని భయం, బెరుకు కనిపిస్తాయి. అయితే అలాంటి సమయంలో ఒక ఉన్నత స్థాయి అధికారి స్వయంగా విద్యార్థుల వద్దకు వచ్చి పూలతో స్వాగతం పలికితే అది వారికి ఎంతో భరోసా ఇస్తుంది. ఉన్నతాధికారి పూల బొకేలతో స్వాగతం పలకడంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ ఉన్నతాధికారి ఎవరు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా పాఠశాల ప్రవేశ మార్గం వద్ద ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలకడం సహజమే. కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నంబర్ 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉన్నతాధికారి తన సిబ్బందితో కలిసి విద్యార్థులకు స్వయంగా పూలు అందించి పాఠశాలలోకి ఆహ్వానించారు. విద్యార్థుల భుజం తట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆ ఉన్నతాధికారి పూల బొకేలతో స్వాగతం పలకడంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
2002 ఎస్జీటీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2009లో గ్రూప్ 1 పాసై డీఎస్పీ ఉద్యోగం సంపాదించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. తన నిబద్ధత, కృషి ద్వారా పోలీస్ శాఖలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) స్థాయికి ఎదిగారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుండి ఎస్పీగా ఎదిగి పాఠశాల పునఃప్రారంభం సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పూల స్వాగతంతో భరోసా కల్పించారు. పాఠశాల ఆవరణలో వారితో మమేకమై భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడంపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. అక్కడితో ఆపకుండా తమ సొంత నిధుల నుండి పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు అందించారు. ఈ విద్యా సంవత్సరం తరగతుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే విద్యార్థులకు 10,116 , 5,116 రూపాయల బహుమతిని ప్రకటించారు. విద్యార్థులు సెల్ ఫోన్లు ,, సినిమాలు శిఖార్లు అని ఆగం కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదువుకోవాలని సూచించారు. పాఠశాలకు , ఉపాధ్యాయులకు తద్వారా సమాజానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు పోలీసులు మిత్రులేనని తెలియజేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ టచ్ స్వయంగా చూపిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. ఈ ఘటన విద్యార్థుల్లో పోలీసుల పట్ల ఉండే భయాన్ని దూరం చేయడమే కాకుండా గౌరవాన్ని పెంపొందిస్తుందనేది వాస్తవం. ఈ అధికారులు చూపిన చొరవ విద్యార్థులకు కేవలం స్వాగతం మాత్రమే కాదు, విద్య పట్ల ఆసక్తిని పెంచడం, భవిష్యత్తు పట్ల భరోసా కల్పించడానికి బలమైన ప్రేరణ కావాలని ఎస్పీ నరసింహ అన్నారు. ఇది కేవలం పూల స్వాగతం కాదు, భవిష్యత్తు తరాలకు అందించిన ఆత్మవిశ్వాసంగా చూడాలని ఆయన అన్నారు. ఎస్పీ స్థాయి అధికారి తమతో ఫ్రెండ్లీగా ఉండడం పట్ల విద్యార్థులు సంతోషంగా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




