CM Revanth Reddy: కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. కొత్త ఏడాదిలో కాబోయే మంత్రులు వీరేనా?
Telangana Cabinet Expansion: కొత్త సంవత్సరంలో కొత్త కేబినెట్. ఎవరికి దక్కేనో ఛాన్స్? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ. ఖాళీగా ఉన్న బెర్త్‌లను భర్తీ చేసి.. ఫుల్ టీమ్‌తో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ.. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కబోతోంది? పదవులు ఆశించి భంగపడ్డ వారికి పార్టీ ఎలాంటి న్యాయం చేయబోతోంది?

తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ బాటపట్టారు. శనివారం జరగబోయే CWC సమావేశంలో పాల్గొనబోతున్నారాయన. ఆ తర్వాత పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఫుల్ కేబినెట్ కూర్పు కోసం అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 1 తర్వాత.. విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది.
ఇద్దరికి మాత్రమే అవకాశం
రేవంత్ కేబినెట్‌లో ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఖాళీ ఉంది. ఆ రెండు బెర్త్‌ల కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
రాజీనామా చేస్తానంటూ గతంలో ప్రకటన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు మల్‌రెడ్డి రంగారెడ్డి. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ గతంలోనే హామీ ఇచ్చారని చెప్తున్నారాయన. గత విస్తరణ సమయంలోనే ఆయనకు పదవి రాకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కులమే అడ్డంకి అయితే.. బీసీకి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. తానే స్వయంగా రాజీనామా చేసి బీసీని గెలిపించుకుంటానంటూ బాహాటంగానే చెప్పారాయన.
పార్టీ హామీ ఇచ్చిందంటున్న రాజగోపాల్‌రెడ్డి
ఇక.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా గతంలో పార్టీ హామీ ఇచ్చింది. తనకు మంత్రి పదవి ఖాయమైందంటూ ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రకటించుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కూడా కట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా తనకు మంత్రి పదవి వస్తుందంటూ బహిరంగంగానే చెప్పారు.
మరోవైపు బీసీ కోటాలో ఆదిశ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేర్లు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఒక బీసీ, ఒక ఓసీకి ఇస్తారా.. లేదంటే, రెండూ ఓసీలకే ఇస్తారా అనేదే ఇప్పుడు సస్పెన్స్. కేవలం విస్తరణకే పరిమితమా.. లేక, శాఖల మార్పులు కూడా ఉంటాయా అనే దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది.
డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్
చీఫ్ విప్‌తో పాటు అడ్లూరి స్థానంలో ఖాళీ అయిన విప్ భర్తీపైనా పార్టీ ఫోకస్ పెట్టింది. మంత్రి పదవి దక్కని వాళ్లతో పాటు సీనియర్లు.. విప్ పదవి రేసులో ఉన్నారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌ను నియమించేందుకూ రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అన్ని పదవులు భర్తీ చేసి.. కొత్త ఏడాదిలో ఫుల్ కేబినెట్‌తో ముందుకెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. మరి.. ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది వెయిట్.. అండ్ సీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
