Telangana: మూఢనమ్మకాల మత్తులో కన్న కూతురిని బలి ఇచ్చిన తల్లి.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే
సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న నేటి ఆధునిక కాలంలో ఇంకా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. మూఢత్వంతో సర్పదోషాన్ని తొలగించుకునేందుకు.. ఓ తల్లి కన్న కూతురిని నర బలి ఇచ్చి మాతృత్వానికే మాయం మచ్చను తీసుకువచ్చింది. కన్న కూతురునీ కడతేర్చిన ఆ తల్లికి కోర్టు ఎలాంటి శిక్ష విధించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకల తండాకు చెందిన కృష్ణ, భారతి ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. భారతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయగా, భర్త నుంచి విడిపోయి 2019లో కృష్ణను వివాహం చేసుకుంది. వీరికి పాప జన్మించింది. అయితే పెళ్లికి ముందు ఆమెకు సర్పదోషం ఉందని జ్యోతిష్యుడు చెప్పడంతో అప్పటి నుంచి భారతి రకరకాల పూజలు చేస్తూ వస్తోంది. కూతురిని కూడా పట్టించుకోకుండా పూజల్లో మునిగి పోతుండటంతో విసుగు చెంది భర్త, అత్త మామలు ఆమెను మానసిక వైద్యుడికి చూపించారు. మందులు వాడకుండా భారతి.. మంత్ర శక్తులతో తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటానని చెప్తూ పూజలు చేసేది.
సర్ప దోష నివారణకు కూతురు బలి…
సర్ప దోష నివారణకు నర బలితో పూజలు చేయాలని భారతి భావించింది. 2021 ఏప్రిల్ 15న కృష్ణ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే సరైన సమయమని నిర్ణయించుకుంది. తన సర్పదోష నివారణకు ఏడు నెలల తన కుమార్తెను కిరాతకంగా నాలుక, గొంతు కోసి హత్య చేసి భారతి తన పుట్టింటికి పరారైంది. కృష్ణ ఇంటికి వచ్చేసరికి చిన్నారి రక్తపు మడుగులో పడి ఉంది. కృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భారతిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
భారతీకి ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం…
ముక్కుపచ్చలారని కన్న కూతురును క్షుద్రపూజలకు బలి ఇచ్చిన ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలు సేకరించారు. మూఢ నమ్మకం కోసం పేగు బంధాన్ని మరిచి ఏడు నెలల పసిబిడ్డను నరబలి ఇచ్చిన కిరాతక తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సర్పదోష నివారణ పేరుతో కుమార్తెను గొంతు, నాలుక కోసి హతమార్చిన ఆమెకు మరణ దండన విధించడమే సరైనదని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ తీర్పు వెలువరించారు. దోషికి ఉరిశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే అదనంగా 3నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందనీ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..