School Bus Fitness: ఆ బస్సులు భద్రమేనా?.. అధికారులు పట్టించుకునేనా?.. ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు..!
School Bus Fitness: రెండేళ్ల కరోనా ఆటంకం తర్వాత, ఎట్టకేలకు స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు కూడా హుషారుగా వెళ్తున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కంగారు పడుతున్నారు.
School Bus Fitness: రెండేళ్ల కరోనా ఆటంకం తర్వాత, ఎట్టకేలకు స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు కూడా హుషారుగా వెళ్తున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కంగారు పడుతున్నారు. మరి, పేరేంట్స్ ఆందోళనకు కారణం ఏంటీ? అంటే స్కూల్ బస్సులను చూపుతున్నారు. అవును, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, పిల్లలను స్కూళ్లకు పంపిస్తారు. వారి చదువే, వీరి భవిష్యత్తుగా భావిస్తారు. కానీ, కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం, చిన్నారుల బంగారు భవిష్యత్తును, బస్సు ప్రమాదాలకు బలి చేస్తోంది. దీంతో పాఠశాలలు ప్రారంభం కాగానే, పేరేంట్స్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో చదివే చాలా మంది విద్యార్థులు, ఆ స్కూల్ బస్సుల్లోనే పాఠశాలకు వెళ్లివస్తారు. దీంతో బడి బస్సు భద్రమేనా అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. దానికి అనేక కారణాలున్నాయి. బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1300 వరకు స్కూల్ బస్సులు ఉన్నాయి. వాటికి సంబంధించి, గత మే 15 నుంచే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు, అధికారులు. కానీ, 30 శాతం వరకు స్కూల్ బస్సులు మాత్రమే ఆర్‌టీఏ కార్యాలయానికి వచ్చి ఫిట్‌నెస్ టెస్టులు చేయించుకున్నాయి. మిగతా బస్సుల జాడ లేదు. అటు ఇప్పటికే స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టామని చెబుతున్నారు, ఆర్‌టీఏ అధికారులు. ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని, ఇప్పటి వరకు 15 బస్సులు సీజ్ చేసామని వెల్లడించారు అధికారులు.
జిల్లాలో చాలా స్కూల్స్ బస్సులకు ఫిట్‌నెస్ లేకుండానే తిప్పుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఉండడంతో, స్కూల్ బస్సులు రోడ్లపైకి రాలేదు. దీంతో అధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేదు. అటు, బస్సుల్లో సీట్లు, అద్దాలు, టైర్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలని సూచిస్తున్నారు, రవాణాశాఖ అధికారులు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 నిబంధనలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. బస్సుల విషయం అటుంచితే, ఆటోలు కూడా పిట్‌నెస్ లేకుండానే స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నాయి. దీనిపై ఫైర్ అవుతున్నారు విద్యార్థి సంఘాలు. రవాణ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టి, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఫిట్‌నేస్ లేని బస్సులు రోడ్డెక్కుతుండటంతో, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, చిన్నారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.