Minister KTR: ‘మూడు నెలలు ఫోన్ పక్కన పెట్టండి’.. యువకుల్లో సరికొత్త జోష్ నింపిన మంత్రి కేటీఆర్..
Minister KTR: మంత్రి కేటీఆర్ మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. పొలిటికల్ స్పీచ్‌లే కాదు, యువతకు మార్గనిర్దేశనం చేసే మాటలు కూడా చెప్పగలనని నిరూపించుకున్నారు.
Minister KTR: మంత్రి కేటీఆర్ మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. పొలిటికల్ స్పీచ్‌లే కాదు, యువతకు మార్గనిర్దేశనం చేసే మాటలు కూడా చెప్పగలనని నిరూపించుకున్నారు. ఓ మూడు నెలలు ఫోన్లు పక్కనబెట్టి కష్టపడి చదవండి.. మీకు ఉద్యోగాలు ఎందుకు రావో నన్నడగండి.. అంటూ నిరుద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపారు కేటీఆర్. అవును, మూడే మూడు నెలలు కష్టపడి చదవండి, కానీ ఫోన్లు పక్కన పారేయండి, అంటూ నిరుద్యోగులకు క్లాస్ పీకారు మంత్రి కేటీఆర్. ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చితీరుతుందంటూ నిరుద్యోగుల్లో ఆకాంక్షను రగిలించారు. కసితో చదివితే ఎందుకు ఉద్యోగం రాదంటూ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కసితో చదవాలని, ఉద్యోగం సాధించాలని ఉద్యోగార్థులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొబైల్స్ వాడకాన్ని తగ్గించాలని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. జీవితం చాలా పెద్దది.. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దని చెప్పారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే ప్రయివేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో.. ఎన్నో అద్భుతాలు సృష్టించామని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. సాగునీటిని అందించడంతో బీడు భూములు కూడా సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. అభివృద్ధికి ప్రామాణికాలైన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో ముందంజలో ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నామని చెప్పారు.