Rythu Bandhu: నేటి నుండి తెలంగాణలో రైతు బంధు సాయం పంపిణీ.. అత్యధికంగా నల్గొండ జిల్లాకు రూ.608.81 కోట్లు
Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు సాయం మంగళవారం నుంచి అందించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50..
Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు సాయం మంగళవారం నుంచి అందించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల 18వేల ఎకరాలకు సంబంధించి 63.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. ఈ మేరకు రైతులు, భూముల వివరాలతో కూడా జాబితాను సీసీఎల్ఏ.. వ్యవసాయ శాఖకు అందించింది.ఆ జాబితా ప్రకారం.. 63 లక్షల 25 వేల 695 మంది రైతుల ఖాతాల్లో రూ.7508.78 కోట్లను రైతుబంధు సాయం కింద జమ చేయనుంది ప్రభుత్వం. 2021–22 బడ్జెట్‌లో వర్షాకాలం, యాసంగి సీజన్లలో రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధుల్లో నుంచి ఆర్థికశాఖ వానాకాలం సాయానికి అవసరమైన రూ.7508.78 కోట్ల నిధులు మంజూరు చేసింది. నేషనల్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు.
ముందుగా ఏ రైతులకు రైతు బంధు అంటే..
కాగా, మొదటి రోజు విడుదల చేసే నిధుల్లో ఎకరంలోపు ఉన్న రైతులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. మరుసటి రోజు నుంచి రోజుకు ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఈ నెల 25 వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.ఉన్న భూమిలో కొంత అమ్ముకోవడంతో కొత్తగా వాటిని కొన్న వాళ్లు రైతు బంధుకు అర్హత సాధించడంతో యాసంగి కన్నా ఇప్పుడు 2.81 లక్షల మంది రైతులు అదనంగా ఇప్పుడు రైతుబంధు సాయం అందుకోనున్నారు. అలాగే పార్ట్–బీలోనివి పరిష్కారమై పార్ట్–ఏలోకి చేరడంతో కొత్తగా మరో 66,311 ఎకరాలు రైతు బంధు సాయం పొందే వీలు కలిగింది.
అలాగే రైతు బంధులో అత్యధికంగా రైతుబంధు సాయం అందుకుంటున్న జిల్లాగా నల్గొండ ఉంది. ఈ జిల్లాలో 4,72,983 మంది రైతులు రైతు బంధుకు అందుకోనున్నానరు. వీరి ఆధీనంలో 12.18 లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే నల్గొండ జిల్లా రైతులకు అత్యధికంగా రూ.608.81 కోట్ల నిధులు విడుదలైయ్యాయి. వర్షాకాలం రైతు బంధు నిధులను అత్యల్పంగా రూ.38.39 కోట్లు మాత్రమే సాధించి మేడ్చల్ మల్కాజ్‌గిరి అట్టడుగున నిలిచింది. ఈ జిల్లాలో 39,762 మంది రైతుబంధుకు అర్హుత సాధించగా, వారి ఆధీనంలో77 వేల ఎకరాలు మాత్రమే ఉంది. అలాగే ఆధార్ అనుసంధానం, ఎన్‌ఆర్‌ఐ కేసులు, ఏజన్సీ భూ సమస్యలు, ఫిర్యాదుల ద్వారా వచ్చినవి, పాసు పుస్తకాలు లేకుండా వారసత్వ బదిలీ, కోర్టు కేసుల్లో ఉన్నవి, పెండింగ్ మ్యుటేషన్‌లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.