AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేతలందరి నోట ‘ఒక్క చాన్స్ ప్లీజ్’.. ప్రజలను ప్రసన్నం చేసుకునే తారక మంత్రమా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా చోట్లా ‘ఒక్క సారి’ రాగం ఊపుందుకుంది. అసలు ఈ ఒక్కసారి ప్లీజ్.. అంటున్న నేతలెవరు? ఎప్పటి నుంచి అంటున్నారు? మరి ప్రజలు వారి అభ్యర్థనను మన్నిస్తారా?..

నేతలందరి నోట ‘ఒక్క చాన్స్ ప్లీజ్’.. ప్రజలను ప్రసన్నం చేసుకునే తారక మంత్రమా?
Representative Image
Janardhan Veluru
| Edited By: Balaraju Goud|

Updated on: May 08, 2022 | 11:07 AM

Share

ఒక్కసారి. ఒకే ఒక్కసారి. ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు దేశంలోని అధికార, విపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. మోదీ నుంచి రాహుల్ గాంధీ వరకు. జగన్ నుంచి లోకేష్ వరకు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు అదే మాట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా చోట్ల ఒక్క సారి రాగం ఊపుందుకుంది. అసలు ఈ ఒక్కసారి ప్లీజ్ అంటున్న నేతలెవరు. ఎప్పటి నుంచి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్న రాహుల్..

పోయినచోటే వెతుక్కోవాలనే సామెతను గుర్తు చేసుకుంటోంది కాంగ్రెస్. రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా అధికారంలో లేదు హస్తం పార్టీ. మహారాష్ట్ర, తమిళనాడులో తాము మద్దతునిస్తున్న పార్టీలు పాలన చేస్తుండటం కాస్త ఊరట కలిగించే అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోను అధికారానికి దూరమైంది. ఫలితంగా ఇప్పుడు దక్షిణాది పై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా రెండు రోజుల తెలంగాణ టూర్ కు వచ్చారు కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన రాహుల్ మాకు ఒక్కసారి చాన్స్ ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేయడం హాట్ టాపికైంది. రెండు సార్లు టీఆర్ఎస్ కు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ కు ఒక్క అవకాశమివ్వండి. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామనడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి
Rahul

Rahul Gandhi

2014,2019లో వర్కౌట్ అయిన ‘ఒక్క అవకాశం’..

యూపీఏ-2 ప్రభుత్వం తరువాత మాకొక అవకాశం ఇవ్వండి అంటూ భారతీయ జనతా పార్టీ(BJP)  ప్రజల వద్దకు వెళ్లింది. 2014 ఎన్నికల సభల్లో మాకొక చాన్స్ ఇవ్వండని ప్రజలను అభ్యర్థిస్తూ మోదీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. ఐదేళ్లలో పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయాం.. మరొక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019లోనూ మోదీ చేసిన విన్నపాన్ని పట్టించుకున్నారు జనాలు. ఫలితంగా దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ.

బండి సంజయ్, సోము వీర్రాజులదీ ఇదే మాట..

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోను అధికారం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులది అదే మాటైంది. మే2, 2022 పాలమూరు జిల్లా నారాయణపేట పాదయాత్రలో మాట్లాడారు బండి సంజయ్. కేసీఆర్ పాలనలో అంతా అవినీతి, అరాచకాలే. బీజేపీకి ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి. గడీల రాజ్యం పోగొడతామన్నారు బండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. బీజేపీ కనీసం అధికారానికి దగ్గరగా వచ్చిన దాఖలాలు ఎన్నడూ లేవు. అందుకే సోము వీర్రాజు జనసేనతో కలిసి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటున్న తీరు ఆసక్తికరంగా మారింది.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 34.3 శాతం ఓట్ షేర్ రాగా..63 సీట్లను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కు 21 స్థానాలు రాగా ఆ పార్టీ ఓట్ షేర్ 25.2 శాతం ఉంది. ఇక బీజేపీ 7.1 శాతం ఓట్ షేర్ తో 5 సీట్లు దక్కించుకుంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ మరిం బలం పుంజుకుంది. ఆ పార్టీకి 88 సీట్లు రాగా 46.87 శాతం ఓట్ షేర్ దక్కింది. కాంగ్రెస్ కు 19 సీట్లు రాగా 28.43 శాతం ఓట్ షేర్ వచ్చింది. మాకు ఒక్క చాన్స్ ఇవ్వాలంటున్న బీజేపీకి తెలంగాణలో కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. ఆ పార్టీ ఓట్ షేర్ 6.98 శాతంగా ఉంది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచి తమ కాషాయం పార్టీ జెండా రెపరెపలాడించింది.

Bandi Sanjay

Bandi Sanjay

పార్లమెంటు ఎన్నికల నాటికి కొంత మార్పు

2019 లోక్ సభ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీల బలా బలాల్లో కొంత మార్పు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 41.29 శాతంతో 9 సీట్లు దక్కించుకోగా…కాంగ్రెస్ పార్టీ 29.48 శాతం ఓట్లతో 3 స్థానాలు హస్తగతం చేసుకుంది. ఇక బీజేపీ 19.45 శాతం ఓట్ షేర్ తో 4 సీట్లు దక్కించుకోవడం విశేషమే మరి. ఈ సారి ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలే కాదు..తెలంగాణ వైఎస్ఆర్ పార్టీతో పాటు..ఉభయ కమ్యూనిస్టులు తహతహలాడుతుండటం ఉత్కంఠను పెంచుతోంది.

2014లో బీజేపీ, టీడీపీకి మద్దతునిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలో మార్పు వచ్చింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి బొక్క బోర్లా పడ్డ జనసేన తన బలాన్ని పెంచుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రేసులో లేకపోవడంతో జనసేన పోరాడింది. వైసీపీ ధాటిని తట్టుకుని తమ వోట్ షేర్ ను 6 నుంచి 27 శాతానికి పెంచుకుంది. జనసేన చెప్పే లెక్కల ప్రకారం చూస్తే 1,209 మంది సర్పంచ్‌లు, 1,776 మంది ఉపసర్పంచ్‌ పదవులు, 4,456 వార్డులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఓటుశాతం 27 శాతంగా ఉండగా..కాపు కాసే నేతలున్న ఆ పార్టీకి ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం ఓట్ షేర్ రాగా, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 32శాతం వోట్ షేర్ వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 18 సీట్లల్లో పోటీ చేయగా…19,11,432 ఓట్లు వచ్చాయి. వోట్ షేర్ 6.30 శాతం ఉంది. 2022 మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్నారు పవన్ కల్యాణ్.

Pawan

Pawan kalyan

మేము తక్కువా ఏంటి..

పాదయాత్ర చేస్తూ మమ్ములను కాస్త పట్టించుకోండి ప్లీజ్ అంటున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. అన్న జగన్ ఏపీలో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోగా.. నేను తెలంగాణను ఏలుతానంటున్నారు షర్మిల. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల మే5, 2022న ఒక్క సారీ మాకు అవకాశం ఇవ్వండి. బంగారు తెలంగాణ అంటే ఏంటో చూపిస్తాం.. మాది దోచుకునే పార్టీ కాదు.. దాచుకునే పార్టీ అసలు కానే కాదు. ప్రజలను ఓదార్చే పార్టీ అంటున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

నాకు ఒక్క చాన్స్ అంటున్న లోకేష్..

ఏప్రిల్6, 2022న మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎమ్మెల్యేలనవుతానంటున్న తీరు చర్చనీయాంశమైంది. వార్డు స్థాయిలోను గెలవని లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశాడు తండ్రి నారా చంద్రబాబునాయుడు అనే విమర్శలొచ్చాయి. ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చూపించు. ఆ తర్వాత మాట్లాడు అంటున్నారు అధికార పార్టీ నేతలు. అందుకే ఈ సారి తనను గెలిపించాలని కోరుతున్నారు లోకేష్. సిఎం వైఎస్ జగన్ కు ఇదే ఫస్ట్, లాస్ట్ చాన్స్ అంటున్నారు ఇంకోవైపు టీడీపీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబు. పిబ్రవరి 21, 2022 విజయవాడ నుంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ మిస్ యూజ్. జనంలో వ్యతిరేకత వచ్చిందని జగన్‌పై చండ్ర నిప్పులు చెరిగారు బాబు. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్సే…లాస్ట్ ఛాన్స్ అంటున్నారు చంద్రబాబు.

Lokesh

Lokesh

జగన్ గెలుపునకు…

2019 ఎన్నికల ప్రచారంలో “ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే నినాదం అందుకున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విభజనాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని శపథం చేశాడు. మార్చి29, 2019 ప్రకాశం జిల్లా కందుకూరు నుండి ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రారంభించారు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఎన్నికల్లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మాట ఇస్తే మడమ తిప్పే రకం జగన్ కాదు. ఆయన తండ్రి వైఎస్ చేసినట్లే జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని పదేపదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అంతే ఒకే ఒక్క సారి నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లను కట్టబెట్టారు జనాలు. చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకే టైమ్ సరిపోలేదు. మరోసారి చాన్స్ ఇవ్వండి అంటున్నారు జగన్.

జాతీయ స్థాయిలోను అదే మాట..

2016, ఆగస్టు 22న కశ్మీర్ లో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి దాదాపు ఇదే మాట మాట్లాడారు. మీరు నాపట్ల ఆగ్రహంగా ఉండొచ్చు. మీ పట్ల నాకు కోపం ఉండొచ్చు. కానీ దయచేసి నాకొక అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్ అనడం వాస్తవమే. ముప్తీనే కాదు మే1, 2022న గుజరాత్ లో అడుగు పెట్టిన ఆఫ్ అధినేత, ఢిల్లీ సిఎం కేజ్రివాల్ అదే రాగం ఆలపించడం ఆసక్తికరమే. ఒక్క ఛాన్స్ అంటూ పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రంలోనూ ఒక్క ఛాన్స్ అంటోంది. మాకు ఒక్కసారి చాన్స్ ఇవ్వండి వారి అహంకారం అణచివేస్తాం, మార్చకపోతే గెంటేయండి అంటున్నారు అరవింద్ కేజ్రివాల్.

ఇటు కేసీఆర్ అటు మోదీలు హ్యాట్రిక్ విజయం పై కన్నేసి గెలుపు కసరత్తులు చేస్తుండగా..మాకు ఈ సారి చాన్స్ అంటూ విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఫలితంగా ఏం జరగనుందోనన్న ఉత్కంఠ పెరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఒక్క చాన్స్ ఇస్తారో వేచి చూడాలి.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు

Also Read

Samantha: గతంలో ఆ విషయంలో నాకు ధైర్యం లేదు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. డైలాగులతో దుమ్ముదులిపిన మహేష్..

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..