Aam Aadmi party: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఉద్యమ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఆప్!

తెలంగాణ‌లో టీఅర్ఎస్ అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన ప్రతిప‌క్ష స్థానం కోసం తీవ్రంగా పోటి ప‌డుతున్నాయి.

Aam Aadmi party: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఉద్యమ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఆప్!
Aap Tjs
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 03, 2022 | 4:49 PM

Aam Aadmi party: తెలంగాణ‌(Telangana)లో టీఅర్ఎస్(TRS) అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన ప్రతిప‌క్ష స్థానం కోసం తీవ్రంగా పోటి ప‌డుతున్నాయి. వీరికి తోడు ఉందా లేదా అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి. ఇక మెన్ననే వైఎస్అర్‌టీపీ పార్టీ పెట్టి పాద‌యాత్రలు కూడా మొదలుపెట్టారు మాజీ సీఎం వైస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ష‌ర్మిల‌. మ‌రోవైపు ఎంఐఎం ఉన్నా అది టీఅర్ఎస్‌తో అవ‌గాహ‌న‌తోనే ఉంది. కోదండ‌రాం పెట్టిన టీజేఎస్ కూడా ఉనికిని చాటుకునే ప్రయ‌త్నం చేస్తుంది. ఇక, బహుజన సమాజ్ వాదీ పార్టీని భుజానికెత్తుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ కూడా కేసీఅర్‌పై యుధ్దం ప్రక‌టించారు. లెఫ్ట్ పార్టీలు తెలంగాణ వ‌చ్చాక ఉనికిని కొల్పోయాయి. ఇది తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం.

టీఅర్ఎస్‌తో ప్రధానంగా పోరాడుతుంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. బీజేపీ అయితే కేంద్రం అండ‌తో కాస్త దూకుడుగానే వ్యవ‌హ‌రిస్తుంది. ఇటు గులాబి నేత‌లు కూడా బీజేపీపై మాటల యుధ్దం చేస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత టీఅర్ఎస్‌కు మ‌రో ప్రత్యర్థి పుట్టుకొచ్చారు. తెలంగాణ‌లో పాగా వేసేందుకు ప్రయ‌త్నాలు మొదలుపెట్టింది ఈ కొత్త రాజ‌కీయ శ‌క్తి. ఇప్పటివ‌ర‌కు పెద్దగా రాష్ట్రంలో యాక్టివిటిలేని ఈ పార్టి ఇక్కడున్న మ‌రో పార్టీని త‌న‌లో క‌లుపుకునేందుకు వేగంగా అడుగు వేస్తోంది. తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేకపోయినప్పటికీ తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ను చీపురుతో ఉడ్చేసి అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది అమ్ అద్మీ పార్టీ. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లిలో అధికారంలో ఉన్న అప్.. పంజాబ్‌లో పాగా వేసి.. తన అకౌంట్‌లో రెండో రాష్ట్రాన్ని వేసుకుంది. దేశంలో ఇప్పటివ‌ర‌కు రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన మెద‌టి ప్రాంతీయ పార్టీగా రికార్డ్ కూడా ద‌క్కించుకుంది అప్. అంతేకాదు పోటి చేసిన గోవాలో కూడా మంచి ఫ‌లితాల్ని రాబ‌ట్టుకుంది. ఇదే ఉపుతో ఇత‌ర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపెతం చేసేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు అప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరిలో జరుగనున్న గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సమర శంఖం పూరిస్తున్నారు.

ఇటు దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ‌లో కూడా పార్టీ కార్యక్రమాలను మొదలు పెట్టింది ఆప్. ఇటీవ‌లే ఇందిరా శోభ‌న్‌ను రాష్ట్ర పార్టీ క‌న్వీన‌ర్‌గా నియ‌మించారు. హైద‌రాబాద్‌ లాంటి మెట్రో సిటీ ఉన్న తెలంగాణ‌లో అప్‌కు అద‌ర‌ణ ఉంటుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారించిన కోదండ‌రాం పార్టీతో క‌లిసిప‌నిచేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. క్లీన్ ఇమెజ్ ఉన్న కోదండ‌రాం పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేసే ప్రతిపాద‌న తెర‌పైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కోదండ‌రాంకు పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్పజెప్పాల‌ని కూడా అధినేత కేజ్రీవాల్ యోచిస్తున్నట్లు సమాచారం. ఉద్యమంలో ప‌తాక స్థాయిలో పాల్గొన్న ప్రొఫెస‌ర్ వ‌ల్ల త‌మ‌కు తెలంగాణ‌లో గ్రాండ్ ఎంట్రీ ల‌భిస్తుంద‌ని అప్ భావిస్తోందట. త్వర‌లోనే హైద‌రాబాద్‌లో ప‌ర్యటించ‌నున్న కేజ్రీవాల్ ప్రొఫెస‌ర్ ముందు ఈ ప్రతిపాద‌న పెడ‌తార‌ని తెలుస్తోంది. ఇలా రాష్ట్రంలో కేసీఆర్‌కు అప్ మ‌రో ప్రత్యర్థి కానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

అటు జాతీయ రాజ‌కీయాల్లో కూడా కేసీఅర్‌కు కేజ్రీవాల్ అడ్డంకిగా మార‌నున్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావ‌డంతో పీఎం డ్రీమ్ కామ‌న్ గానే ఉంటుంది. కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌, బీజేపీల‌కు దూరంగా ఉంటున్నారు. ఢిల్లిలో బీజేపీ, పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అప్‌ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ కూడా మూడో కూట‌మి ఆలోచ‌న‌లో ఉన్నారు. కేజ్రీవాల్ క‌నుక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జిని, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కలుపుకోగ‌లిగితే, ఇక తన‌కు ప్రధాన మంత్రి స్థానానికి పోటి లేదనే భావ‌న‌లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లు రాజకీ వేత్తలు అంచనా వేస్తున్నారు. మ‌రోవైపు కేసీఅర్ కూడా జాతీయ ప్రత్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌ను ప్రారంభించే ఏర్పాట్లలో ఉన్నారు. కేసీఅర్ కూడా రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు దూరంగా ఉంటున్నారు. సో రాష్ట్రంలోను జాతీయ స్థాయిలోను కేజ్రీవాల్, కేసీఆర్‌కు కొత్త ప్రత్యర్థిగా మార‌నున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినప్పటికీ, ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. అయితే, పార్లమెంటు ఎన్నికల నాటికీ ఏయే పార్టీల మధ్య పోటీ ఉంటుందో, ఎన్ని కూటమిలు ఏర్పాటు కానున్నాయో వేచి చూడాల్సిందే.

—– రాకేష్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also…  US-India: భారత్‌కు సలహాలు ఇచ్చే ముందు అమెరికా తన గత చరిత్ర తెలుసుకుంటే మంచిది!