Telangana: దుబ్బాకలో మొదలైన ఎన్నికల హడావిడి.. క్షేత్ర స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ బిజీ బిజీగా..

Telangana: తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం పేరు కొంత మందికే తెలుసు.. కానీ అక్కడ జరిగిన ఉపఎన్నిక తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని..

Telangana: దుబ్బాకలో మొదలైన ఎన్నికల హడావిడి.. క్షేత్ర స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ బిజీ బిజీగా..
Dubbaka Politics
Follow us
P Shivteja

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 28, 2023 | 5:32 PM

దుబ్బాక నియోజకవర్గం, ఆగస్టు 28: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల లీడర్ల్ అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు ఇప్పటి నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం పేరు కొంత మందికే తెలుసు.. కానీ అక్కడ జరిగిన ఉపఎన్నిక తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షించింది దుబ్బాక నియోజకవర్గం.. అందుకే ఈ నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి ప్రధాన పార్టీలు అన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి.

అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి మూడు ప్రధానమైన పార్టీలు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఇప్పటి నుండే తమ వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయం రసవతరంగా మారి త్రిముఖ పోటీ నడుస్తుండడంతో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో అధికారం కోసం పావులు కలుపుతున్నారు.

ఇక బిఆర్ఎస్ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయం వాడివేడిగా కొనసాగుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గత కొన్ని నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ చిన్న చితక సమస్యలను తీరుస్తూ, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నారు. అంతేకాకుండా పక్క పార్టీల నుండి తమ పార్టీలోకి యువతను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే కావాలన్న తన కలను ఈ ఎన్నికల్లో తీర్చుకోవడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారని రాజకీయ వర్గాల చర్చ. మొన్నటికి మొన్న యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్‌ను అందించారు ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి. ఖచ్చితంగా ఈ సారి దుబ్బాక ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకునేందుకు కార్యకర్తలతో ఎన్నికల సమయంలో ఎలా ముందు కెళ్లాలనే విషయాలను చర్చించుకుంటూ ఎప్పటి కప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇక్కడ ఉన్న బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. దుబ్బాకలో బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యే సీటు ఆశించే నాయకులు ఎవరూ లేకపోవడంతో, దుబ్బాక ఎమ్మెల్యే సీటు మళ్లీ తనకే వస్తుందన్న గట్టి నమ్మకంతో రఘునందన్ రావు చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో బిజెపి భూతస్థాయి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉంటూ అతని వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కారం చేసుకుంటు బిజీగా ఉంటున్నారు. దుబ్బకలో ఈసారి కూడా బిజెపి జెండాను ఎగురవేయాలని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. అందుకే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించరట.. ఈ మధ్యకాలంలో బిజెపి అధిష్టానం తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారు.. దుబ్బాక ఇన్చార్జిగా సోలాపూర్ ఎమ్మెల్యే సుభాష్ దేశ్ముఖ్ ను నియమించడంతో ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటించి దుబ్బాక నియోజక వర్గంలో మళ్లీ బిజెపి పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్స్ కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ గా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు అయినప్పటికీ ఈ సారి ఆయన వెనక్కి తగ్గలేదంటున్నారు. నిత్యం నియోజకవర్గ పరిధిలోని ప్రజలలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల వెంటే ఉంటున్నానని చెప్పుకుంటూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. అయితే ఈసారి కూడా దుబ్బాక కాంగ్రెస్స్ టికెట్ తనకే వస్తుంది అని..ధీమా వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ జూడో యాత్రను ఆదర్శంగా తీసుకొని, దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర అనే పేరు పై ఒక కార్యక్రమం మొదలు పెట్టి.. నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వంద రోజులు పాదయాత్ర నిర్వహించారు.

ఈ పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి సభను నిర్వహించారు. ఇలా కాంగ్రెస్స్ పార్టీ తరపున ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ తన కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సారి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడు తుందని ధీమా వ్యక్తం చేస్తూన్నారు. ఇలా దుబ్బక నియోజకవర్గ పరిధిలో మూడు పార్టీలు బిజీ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.