AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Police: ఎన్నికల వేళ భయం గుప్పెట్లో తెలంగాణ పోలీస్ అధికారులు

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అనేక చర్చలకు తావిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు 13 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఏకంగా 13 మందిని ఎన్నికల కమిషన్ టార్గెట్ చేయడంతో మిగతా సిబ్బంది బిక్కువిక్కుమంటున్నారు.

Telangana Police: ఎన్నికల వేళ భయం గుప్పెట్లో తెలంగాణ పోలీస్ అధికారులు
Telangana Police
Vijay Saatha
| Edited By: |

Updated on: Oct 12, 2023 | 4:34 PM

Share

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అనేక చర్చలకు తావిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు 13 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఏకంగా 13 మందిని ఎన్నికల కమిషన్ టార్గెట్ చేయడంతో మిగతా సిబ్బంది బిక్కువిక్కుమంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఈసారి తెలంగాణలో కత్తి మీద సాముల మారింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన వారంలోపే ఈ స్థాయిలో అధికారులపై వేటు వేయడం ఇదే మొదటిసారి. ఎలక్షన్ కమిషన్ చర్యపై రాష్ట్రస్థాయిలో బ్యూరో క్రాట్లు చర్చించుకుంటున్నారు. మొదటి లిస్టులోనే ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం ఒకసారిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దెబ్బతో కిందిస్థాయి అధికారులు అంతా అలెర్ట్ అయిపోయారు. ఎక్కడ ఎలాంటి అపరాదు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చర్యల లిస్టులో తమ పేరు లేకుండా చూసుకునేందుకు పగడ్భంగా పని చేస్తున్నారు..

గత ఎన్నికల నిర్వహణలో పలువురు అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.. గత బై ఎలక్షన్ సందర్భంగా దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడ్ ఎన్నికలలో పలువురు అధికారుల తీరు వివాదాస్పదమైంది. అలాంటి పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చోటు చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకుండా బదిలీ వేటు వేసింది. ఈ దెబ్బతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది..ఇప్పటికే చాలా మంది అధికారులపై ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ తరుణంలో ఎక్కడా చిన్న ఘటన జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అలెర్ట్‌గా ఉంటునారు. ఏకంగా తమ కేరియర్ మీదే రిమార్క్ పడే అవకాశం ఉంది.. డీజీ స్థాయి అధికారులను కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. గతంలో డీజీపీని సైతం బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. 2009 ఎన్నికల సందర్భంగా అప్పటి డీజీ SSP యాదవ్ ను ఎన్నికల కమిషన్ మార్చింది. ఆయన స్థానంలో మహంతి నియమించింది. అయితే అప్పుడు కేవలం ఒక్క అధికారిని మార్చారు. ఈసారి 2023 ఎన్నికల్లో మాత్రం ఏకంగా 13 మందిని మార్చేసింది ఎన్నికల కమిషన్.

కొత్త కొత్వాల్ రేస్ లో నలుగురు..?

బదిలీ చేసిన 13 మంది అధికారులకు ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి పోస్టింగ్ ఇచ్చే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ రిమార్క్ వేసుకోవడం అంత మంచిది కాదనే భావనతో మిగతా అధికారులు ఎన్నికల సమయంలో జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు కోసం అడిషనల్ డీజీ క్యాడర్ అధికారుల లిస్ట్ సాయంత్రానికి ఎన్నికల కమిషన్‌కు చేరనుంది. దీంతో పలువురి పేర్లు బాగా వినికిడిలో ఉన్నాయి. అందులో కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, మహేష్ భగవత్, శివధర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురే కాకుండా రాష్ట్రంలో 10 మందికి పైగా అడిషనల్ డీజీలు ఉన్నారు. వీరిలోనూ ఎవ్వరో ఒకరిని సాయంత్రానికి హైదరాబాద్ సీపీగా ఎన్నికల కమిషన్ నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ చర్య ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ C.V.ఆనంద్, వరంగల్ కమిషనర్ రంగనాథ్ తోపాటు పలువురు ఐపీఎస్‌లు, నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వరంగల్, నిజామాబాద్‌ కమిషనర్లతోపాటు మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, భూపాలపల్లి, జగిత్యాల, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఎస్పీలను ఒకేసారి మార్చడం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇటీవలే నిర్వహించిన సమీక్షలో పోలీస్‌శాఖపై ఎన్నికల కమిషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో యూనిట్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరును కమిషన్‌ తప్పుపట్టింది. నగదు, మద్యం ప్రవాహం భారీగా సాగినా జప్తు విషయంలో ఉదాసీనంగా ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అధికారుల పనితీరుపై సమావేశంలోనే తీవ్ర అసహనం ప్రదర్శించినట్లు తెలిసింది. ఎన్నికల్లో ప్రలోభాలను నియంత్రించే విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో తప్పిదాలను ఎత్తిచూపింది. గతంలో ఎన్నడూలేని రీతిలో జరిగిన ఈ సమీక్ష తీరుపై పోలీస్‌శాఖలో విస్తృతంగా చర్చ జరిగింది.

ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన వాళ్ల స్థానంలో కొత్త కమిషనర్లు, ఎస్పీల నియామక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఒక్కో స్థానానికి ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను గురువారం సాయంత్రంలోపు పంపాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపే జాబితాపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఇప్పుడు మార్చిన జిల్లా ఎస్పీలంతా నాన్‌కేడర్‌ ఎస్పీలే కావడం గమనార్హం. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వీరిని లూప్‌లైన్‌కు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొత్తగా నియమించాల్సిన యూనిట్‌ అధికారుల గురించి ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పలువురు డైరెక్ట్ ఐపీఎస్‌లున్నా చాలామంది లూప్‌లైన్‌కే పరిమితం చేశారు. దీంతో ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పంపే తాజా జాబితాలో వీరికి అవకాశం కల్పిస్తారా? లేదా? గతంలో ఎంపిక చేసిన మాదిరిగానే నాన్‌ కేడర్‌ ఎస్పీల పేర్లను పంపిస్తారా అనే చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..