Ponnam vs Praveen: పొన్నం vs ప్రవీణ్ రెడ్డి.. కాంగ్రెస్ నేతల పోటాపోటీ ప్రచారంతో హీటెక్కిన హుస్నాబాద్ నియోజకవర్గం
కాంగ్రెస్ సీనియర్ పక్కచూపులు చూస్తున్నారు. వేరేగా అపార్థంచేసుకోడానికేం లేదు. పాత సీటునొదిలేసి పొరుగు సీటుపై కన్నేశారు. మళ్లీ ఎంపీగా పోటీచేస్తానని సంకేతాలిచ్చిన లీడర్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. మరో సీటుపై మనసు పారేసుకున్నారు. సీనియర్ సడెన్ ఎంట్రీతో అక్కడ టికెట్‌పై నమ్మకం పెట్టుకున్న లీడర్ అయోమయంలో పడ్డారు. ఎక్కడిదీ సీన్? సీనియర్ సీటు మార్చడం వెనుక వ్యూహమేంటి?

కాంగ్రెస్ సీనియర్ పక్కచూపులు చూస్తున్నారు. వేరేగా అపార్థంచేసుకోడానికేం లేదు. పాత సీటునొదిలేసి పొరుగు సీటుపై కన్నేశారు. మళ్లీ ఎంపీగా పోటీచేస్తానని సంకేతాలిచ్చిన లీడర్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. మరో సీటుపై మనసు పారేసుకున్నారు. సీనియర్ సడెన్ ఎంట్రీతో అక్కడ టికెట్‌పై నమ్మకం పెట్టుకున్న లీడర్ అయోమయంలో పడ్డారు. ఎక్కడిదీ సీన్? సీనియర్ సీటు మార్చడం వెనుక వ్యూహమేంటి?
హుస్నాబాద్ నియోజకవర్గంలో వైవిధ్యమైన రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి. ఇక్కడి నుండి ఇద్దరు సీనియర్ నేతలు టికెట్ ఆశించడమే కాకుండా పోటాపోటీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే విస్త్రృతంగా సాగుతున్నప్పటికీ ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక క్యాడర్ తికమకపడుతోంది. ఇక్కడి నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు.
ఓ వైపున పొన్నం ప్రభాకర్, మరో వైపున అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ నుండి మొదలు.. రాత్రి వరకు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా వర్గాల వారిని కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్న పొన్నం.. టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర, దేశ రాజధానిల చుట్టూ చక్కర్లు కొడుతూ లాబియింగ్ చేస్తూనే.. మరో వైపు హుస్నాబాద్ ప్రజలను తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో పొన్నం మునిగిపోయారు. జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు ఉండడం తమ నేతకు కలిసివస్తుందని పొన్నం ప్రభాకర్ అనుచరులు ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా స్థానికంగా పొన్నం సామాజిక వర్గానికి చెందిన వారి ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉందని, బీసీ కార్డు కూడా ప్రయోగిస్తే సక్సెస్ అవుతామంటున్నారు పొన్నం వర్గీయులు..
గతంలో హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సైతం ప్రచారంలో దూకుడు పెంచారు. పరామర్శలతో పాటు వ్యక్తిగతంగా ప్రజలను కలుస్తూ మద్దతు కూడబెట్టుకునే పనిలో పడ్డారు. అంతేకాదు ముల్కనూరు సహకార బ్యాంకు ఛైర్మన్‌గా కూడా అయనకు రైతాంగంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు ఇతర వర్గాలు తనకు అనుకూలంగా ఉంటాయని ప్రవీణ్ రెడ్డి అధిష్టానం పెద్దలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఓసారి గెలిచిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీలో చేరి తిరిగి సొంత గూటికి వచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డికి అనుకూలంగా ఉండటం కలిసొస్తుందంటున్నారు ప్రవీణ్ రెడ్డి అనుచరులు. ముఖ్యంగా ముల్కనూరు సహకార బ్యాంకు సభ్యుల ఓట్లే తన గెలుపును ఖాయం చేస్తాయని ప్రవీణ్ రెడ్డి వర్గీయులు ధీమాతో ఉన్నారు. స్థానికత అంశంతో పాటు సాఫ్ట్ నేచర్ అన్న భావన కూడా హుస్నాబాద్ ప్రజల్లో నెలకొనడం ప్రవీణ్ రెడ్డికి ఉన్న అడ్వంటేజ్ అని అంటున్నారు.
ప్రవీణ్ రెడ్డి వర్గీయుల వాదన ఎలా ఉన్నప్పటికీ అనూహ్యంగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం మాత్రం ఇబ్బందికరంగా మారిందన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందోనన్నది మాత్రం పజిల్ గానే మారింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే జాబితాలో ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందోనన్న చర్చ హుస్నాబాద్‌లో పెద్ద ఎత్తున సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..