Munugode Bypoll: వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పాల్వాయి స్రవంతి.. అన్నా అని వేడుకున్నా నమ్మకద్రోహం చేశారంటూ..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని సొంత అన్నగా భావించా. ఆడబిడ్డ గా నేను మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఉప ఎన్నికలో సహకరించాలని వెంకట్ రెడ్డి అన్నని ప్రాధేయ పడ్డాను.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. టీవీ9తో మాట్లాడుతూ.. ‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని సొంత అన్నగా భావించా. ఆడబిడ్డ గా నేను మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఉప ఎన్నికలో సహకరించాలని వెంకట్ రెడ్డి అన్నని ప్రాధేయ పడ్డాను. మీరే నాకు దైర్యం అని కూడా చెప్పాను. ప్రచారానికి రావాలని వేడుకున్నాను. కానీ వెంకట్ రెడ్డి వైఖరి నాకు బాధేస్తోంది. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నమ్మకద్రోహంగా ఉన్నాయి. నాకు ఆర్థికక బలం లేకపోవచ్చు. కానీ ప్రజా బలం ఉంది. మునుగోడు గడ్డ బిడ్డగా చెబుతున్నా. ఈ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే’ అని ధీమా వ్యక్తం చేశారు స్రవంతి. కాగా నిన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి సంచలన సృష్టించింది. అన్నింటీకీ తన సోదరుడు సాయం చేస్తుంటాడని, పార్టీ చూడకుండా తనకు ఓటేయాలని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి.
అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు కోమటిరెడ్డి. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్‌గా చాలా బలహీనంగా ఉందని తాను మునుగోడులో ప్రచారానికి వెళ్తే ఖర్చులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. పాదయాత్ర చేద్దామంటే కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయన్నారు. పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని,ఇక చాలంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..