AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రుల సమక్షంలోనే రచ్చరచ్చ.. ఎమ్మెల్యేలు సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట..

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజయ్‌ దగ్గరకు వెళ్లారు కౌశిక్ రెడ్డి. ఏ పార్టీ నీదంటూ నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు.

Telangana: మంత్రుల సమక్షంలోనే రచ్చరచ్చ.. ఎమ్మెల్యేలు సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట..
Padi Kaushik Reddy Vs Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Jan 12, 2025 | 7:53 PM

Share

కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ప్రణాళికా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టుకున్నారు.

గొడవ ముదరడంతో కౌశిక్ రెడ్డిని పక్కనున్న ఎమ్మెల్యేలు వారించారు. అయితే ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కౌశిక్‌ను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి తీరును మంత్రి శ్రీధర్‌బాబు సైతం ఆక్షేపించారు.

సమావేశం నుంచి బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. సంజయ్‌కి దమ్ముంటే కాంగ్రెస్‌ టికెట్‌పై గెలవాలని సవాల్ విసిరారు. BRS బీఫామ్‌తో గెలిచిన సంజయ్ కుమార్ సిగ్గులేకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. BRS తరపున గెలిచి కాంగ్రెస్‌ తరపున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఆయనను ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా? అని ప్రశ్నించారు.

వీడియో చూడండి..

కౌశిక్ రెడ్డి తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఏదో రకంగా గొడవ చేయాలనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి ఇలా చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. చాలా మంది నాయకులు గతంలో పార్టీలు మారారని.. కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నాయకుడేన్నారు. ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారని.. హుజూరాబాద్ ప్రజలే ఆయనకు బుద్ది చెబుతారన్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు మరో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మండిప్డడారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కౌశిక్ రెడ్డి ఒక రౌడీ, గుండాలాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే గుడ్డులూడదీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. కానీ ఓ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్..

తనను ఏ పార్టీ అని ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్‌కు లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని తెలిపారు.

మొత్తానికి కొంతకాలంగా తనదైన దూకుడు స్వభావంతో వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవ ద్వారా మరోసారి పొలిటికల్‌గా హాట్‌ టాపిక్ అయ్యారు. మరి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..