Godavari Express: రైల్వే ట్రాక్ పునురుద్ధరణ.. బీబీనగర్ – ఘట్కేసర్ మార్గంలో వెళ్లిన మొట్టమొదటి రైలు అదే..
విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..
విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను సెక్షన్ నుంచి తొలగించి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ మార్గంలో రాత్రి 9.15 గంటలకు త్రివేండ్రం – సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ మొదటగా వెళ్లింది. అంతే కాకుండా సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో అన్ని రకాల సర్వీసులను పునరుద్ధరించారు.
కాగా.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం 6.10 గంటల సమయంలో ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద శబ్ధంతో భారీ కుదుపుతో పట్టాలు తప్పింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశారు. క్షణం ఆలస్యం చేయకుండా రైలులోని వారంతా కిందకు దిగేశారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) వెనుక ఉన్న జనరల్ బోగీ, సరకు రవాణా బోగీ, ఎస్ 1 నుంచి ఎస్ 4 వరకూ ఉన్న స్లీపర్ క్లాస్ బోగీలు మొత్తం 6 వరుసగా పట్టాలు తప్పాయి. బోగీలు ఏవీ పక్కకు పడిపోలేదు. ఒకదానిని ఒకటి బలంగా ఢీకొట్టలేదు. బీబీనగర్ తర్వాత పెద్ద మలుపు ఉండడంతో ఆ సమయంలో రైలు కాస్త నెమ్మదిగా వెళ్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..