Andhra Pradesh: కన్న కూతుర్ని వేధిస్తున్నాడని కత్తితో కసి తీర్చుకున్నాడు.. అలా వద్దన్నా వినకపోవడంతో..
అవమాన భారం తట్టుకోలేక కోపంతో రగిలిపోయాడు. జైలుకెళ్తానని తెలిసినా కాపు కాసి మరీ.. కత్తితో కసి తీర్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
కన్న కూతురిని వేధిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ప్రేమ పేరుతో వెంటపడుతుంటే మందలించాడు. పెళ్లి చేసి పంపినా వాడు తీరు మార్చుకోలేదు. అంతేకాదు తనని వేరే మహిళతో వివాహేతర బంధం అంటగట్టి కుటుంబంలో కలహాలు సృష్టించాలనుకున్నాడు. ఇక అంతే.. అవమాన భారం తట్టుకోలేక కోపంతో రగిలిపోయాడు. జైలుకెళ్తానని తెలిసినా కాపు కాసి మరీ.. కత్తితో కసి తీర్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెద్ద గుమ్ములూరులోని ఓ మద్యం దుకాణం వద్ద జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ప్రవీణ్ కుమార్‌ను హత్య చేసిన రమణను కటకటాల వెనక్కినిటారు. కత్తిని సీజ్ చేశారు. కూతుర్ని వేధిస్తున్నందుకే తట్టుకోలేక రమణ.. ప్రవీణ్ కుమార్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈనెల 13వ తేదీ రాత్రి పెద్ద గుమ్మలూరు వైన్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. కోరుప్రోలు గ్రామానికి చెందిన చొప్ప రమణ అక్కడ పీచు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో ప్రవీణ్ కుమార్ కూడా ఉద్యోగంలో చేరాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. రమణకు ఓ కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో ఏడాదికాలంగా ప్రేమిస్తున్నానని రమణ కూతురు వెంటపడ్డాడు ప్రవీణ్ కుమార్. విషయం రమణకు తెలియడంతో ప్రవీణ్ కుమార్ ను పలుమార్లు మందలించాడు. అయినా అతని తీరు మార్చుకోలేదు. ఇంకా కూతురు వెంట పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో కూతుర్ని వివాహం చేసి పంపించాడు రమణ. అయినా ప్రవీణ్ కుమార్ తన బుద్ధి మార్చుకోలేదు.
ప్రవీణ్ కుమార్ వ్యవహారంతో విసుగుచెందిన రమణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అంతటితో ఆగని ప్రవీణ్ కుమార్.. ఏకంగా కుటుంబంలోనే కలహాలు పెట్టేందుకు ప్రయత్నించాడు. రమణకు వేరే మహిళతో వివాహేతర బంధం ఉందంటూ అతని భార్యను మాయమాటలతో నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రమణ.. ఇక ప్రవీణ్ కుమార్ ను అంతమొందించాలి అనుకున్నాడు.
పథకం ప్రకారం ఈనెల 13వ తేదీ రాత్రి అడ్డరోడ్డు పెద్ద గుమ్ములూరు వైన్ షాప్ దగ్గర కాపు కాసాడు. ప్రవీణ్ కుమార్ తో వాగ్వాదానికి దిగి తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా నరికి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీన్ ఆఫ్ అఫెన్స్ తో పాటు గ్రామంలోని పలువురిని విచారించారు. అనంతరం రమణను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ప్రవీణ్ ను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడని సిఐ నారాయణరావు తెలిపారు. హత్యకు గల కారణం కూతుర్ని వేధించడమేనని వెల్లడించారు.
-ఖాజా, టీవీ9 రిపోర్టర్, వైజాగ్
మరిన్ని ఏపీ వార్తల కోసం..