Telangana: నల్లి బొక్క ఎంత పని చేసింది.. ఇష్టంగా తింటుండగా..
ఇష్టంగా తిన్న నల్లిబొక్క ప్రాణాల మీదకు వచ్చింది. మంచిర్యాల జిల్లాలో మటన్ బొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి తీవ్ర ప్రాణాపాయానికి గురయ్యాడు. సకాలంలో కుటుంబ సభ్యులు, వైద్యుల స్పందనతో చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలుసుకోండి .. ..

రాత్రి మటన్ కూరతో చేసిన భోజనం ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంతో ఇష్టంగా తిన్న నల్లిబొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి విలవిలాడాడు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్టాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారావుపల్లి గ్రామానికి చెందిన టి.శ్రీనివాస అనే వ్యక్తి మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా గొంతులో మటన్ బొక్క ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. శ్వాస ఆడకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు శ్రీనివాస్. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితున్ని చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యుడు నవీన్ ఆడెపు.. శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కున్న మటన్ బొక్కను చాకచక్యంగా తొలగించాడు. ప్రాణాపాయం నుండి శ్రీనివాస్ క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మటన్ బొక్క ఎంత పని చేశావే అంటూ ఈ విషయం తెలిసిన స్థానికులు చర్చించుకున్నారు. కాగా నాన్ వెజ్ తినే సమయంలో జాగ్రత్తలు పాటించాలని.. ఫాస్ట్ తినే ప్రయత్నం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.
