IND vs PAK : భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ బికారే..ఒక్క నిర్ణయంతో రూ.348 కోట్లు గోవిందా
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026 ముంగిట పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఒక వింత పరిస్థితిలో చిక్కుకుంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా? అనే సందిగ్ధంలో పడి కోట్లు నష్టపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోంది. ఒకవేళ మొండికేసి భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కోలుకోలేనంత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఒక్క మ్యాచ్ ఆడకపోతేనే సుమారు రూ.348 కోట్ల భారీ జరిమానా కట్టాల్సి వస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

IND vs PAK : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం నిప్పు మీద నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించాలనే ఆలోచన పీసీబీని ఇరకాటంలో పడేసింది. రాజకీయ కారణాల వల్ల లేదా భారత్ తమ దేశానికి రావడం లేదనే కోపంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయిస్తే, దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఒక్క మ్యాచ్ బహిష్కరణ వల్ల పాకిస్థాన్ దాదాపు 38 మిలియన్ డాలర్ల (సుమారు రూ.348 కోట్లు) నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఎందుకు ఇంత భారీ జరిమానా?
ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే కాసుల వర్షం. బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే వందల కోట్లు సంపాదిస్తాయి. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, బ్రాడ్‌కాస్టర్ కంపెనీకి జరిగే నష్టాన్ని పీసీబీ నుంచి వసూలు చేసేందుకు వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పీసీబీకి అందే వార్షిక ఆదాయం నుంచి ఈ జరిమానా మొత్తాన్ని కోత విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ.
పీసీబీ ముందున్న ప్రత్యామ్నాయాలు
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వారి ముందు ప్రస్తుతం నాలుగు ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది:
టోర్నమెంట్ మొత్తాన్ని బహిష్కరించడం.
కేవలం భారత్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండటం.
నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని మ్యాచ్‌లు ఆడటం.
టోర్నీలో తమ విజయాలను బంగ్లాదేశ్‌కు అంకితం చేయడం ద్వారా నిరసన తెలపడం. కానీ, మొదటి రెండు ఆప్షన్లు పాక్ క్రికెట్‌ను సర్వనాశనం చేస్తాయి. ఐసీసీ నుంచి నిషేధం ఎదుర్కోవడమే కాకుండా, భవిష్యత్తులో జరిగే మెగా టోర్నీలకు కూడా అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది.
నిర్ణయం ఎప్పుడు?
ఈ తీవ్రమైన సమస్యపై తుది నిర్ణయం శుక్రవారం లేదా వచ్చే సోమవారం లోపు వెలువడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ వివాదాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ పాకిస్థాన్ మెట్టు దిగి మ్యాచ్ ఆడితే సమస్య సద్దుమణుగుతుంది, లేదంటే పాక్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. సొంత గడ్డపై తమ పరువు కాపాడుకోవాలా లేక ఆర్థికంగా చితికిపోవాలా అనే సందిగ్ధంలో పాకిస్థాన్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.
