ఓవైపు కూల్చివేతలు.. మరోవైపు నిర్వాసితుల నిరసనలు.. కాకరేపుతున్న మూసీ సుందరీకరణ..!

మూసీ బ్యూటిఫికేషన్‌ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు కూల్చివేతల పర్వం..మరోవైపు నిర్వాసితుల తరిలింపు, డబుల్‌ బెడ్‌ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

ఓవైపు కూల్చివేతలు.. మరోవైపు నిర్వాసితుల నిరసనలు.. కాకరేపుతున్న మూసీ సుందరీకరణ..!
KTR Revanth Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 02, 2024 | 7:38 PM

మూసీ సుందరీకరణ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార పార్టీ కుండబద్ధలు కొట్టి చెప్తుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్షాలు సవాల్ విసురుతున్నాయి.

మూసీ సుందరీకరణ.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన అంశం. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ గా మారిపోయింది ఈ ఇష్యూ. నార్సింగి టు నాగోల్. 55 కిలోమీటర్ల మేర రూపురేఖలు మార్చి కమర్షియల్ హబ్‌గా మార్చుతామని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది. సుందరీకరణ పనుల్లో భాగంగా చాదర్‌ఘాట్ మూసీ పరిధిలో నదీ గర్భంలో ఉన్న ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఉన్న 140 నిర్వాసిత కుటుంబాలను చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్లలోకి తరలించారు..

అయితే సర్కారు చర్యలపై ప్రతిపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇది అభివృద్ధినా? పేదలను రోడ్డు మీద వేయడమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం(అక్టోబర్ 3) నాడు LB నగర్‌లో పర్యటిస్తా.. ఎవరో అడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ చర్యలను విపక్షాలు తప్పుబడుతున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్టు రాహుల్‌ డైరెక్షన్‌లో నడుస్తుందన్నారు. కర్ణాటక సీఎం స్కాంలో ఇరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే  తెలంగాణ నుంచి బంగారు బాతుగా మూసీ ప్రాజెక్టును ఎంచుకున్నారని KTR విమర్శించారు. కూల్చివేతల గందరగోళ వాతావరణంతో తెలంగాణలో పండుగ సందడే లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ ప్రాజెక్ట్‌పై మా విజన్ ఏంటనేది.. రెండు, మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటున్న కేటీఆర్, ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రభుత్వం దగ్గర డీపీఆర్‌ కూడా లేదంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ గతంలో 3 గంటల ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీపై ప్రభుత్వం 3 నిమిషాల వివరణ ఇవ్వగలదా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే మూసీ విషయంలో రాహుల్‌గాంధీని లాగడమెందుకు? ఏమైనా ఉంటే లోకల్‌గా మనం.. మనం చూసుకుందామంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయని కారణంగానే ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌పై ఏ పార్టీకి ప్రేమ ఉందో ప్రజలకు తెలుసన్నారు. కక్ష కట్టింది కాంగ్రెసా? బీఆర్ఎస్సా? అని ప్రశ్నించారు.

మరోవైపు, కూల్చివేతలను అడ్డుకుని తీరుతామని అంటున్నారు కమలం పార్టీ నేతలు. లక్షన్నర కోట్లతో సుందరీకరణ అవసరమా? అంత బడ్జెట్ భరించే శక్తి రాష్ట్రానికి ఉందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అక్బరుద్దీన్‌తో కలిసి లండన్ వెళ్లి లండన్ మాదిరి చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. రోడ్లు వేసి, నీళ్లు ఇచ్చి, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే కూలుస్తా అంటే ఎలా అంటున్నారు కిషన్ రెడ్డి. మూసీకి రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుదంటున్న కేంద్ర మంత్రి.. కూల్చివేతలను అడ్డుకొని తీరుతామని అంటున్నారు.

మూసీ బాధితులకు చంచల్‌గూడలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను స్థానిక MIM ఎమ్మెల్యే బలాల తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించారన్న దానిపై ఆరా తీశారు. బాధితులందరికి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు కేటాయించాలి. అలా కాకుండా ఇల్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదంటున్నారు.

బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రాజెక్ట్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అసలు కేటీఆర్‌, హరీష్‌రావుకు మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఒక్కసారి నల్లగొండకు వచ్చి ఇక్కడి పరిస్థితులు చూడాలన్నారు. అవసరం లేకున్నా బీఆర్ఎస్ మల్లన్నసాగర్ కట్టిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మీకు గోదావరి నీళ్లు.. మాకు మూసీ నీళ్లా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా అంటే బీఆర్ఎస్‌కు ఎందుకంత కోపమో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించినందుకు నల్లగొండపై పగబట్టారని ఆరోపించారు.

సో.. ఇప్పుడు మూసీ అంశం హైదరాబాద్ దాటి.. తెలంగాణ జిల్లాలకు వెళుతోంది. అయినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటోంది. కాని విపక్షాలు మాత్రం పేదలు ఇళ్లు కూల్చితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..