అకాల వర్షాలతో మామిడి రైతులకు భారీ నష్టం
వాతావరణంలో వస్తున్న మార్పుల వలన మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని వలన పూత మొత్తం రాలిపోతుంది. రైతులకు భారీ నష్టం.. అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకి పంట నష్టం చెల్లించాలని కోరుకుంటున్నారు.

వాతావరణ మార్పుల వల్ల మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల మామిడి తోటల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు కనువిందు చేసిన తెల్లటి పూత, నేడు నేల రాలుతోంది. అకాల వర్షాలు, మారుతున్న ఉష్ణోగ్రతలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వసంత కాలం రాకముందే మామిడి తోటలు పూతతో కళకళలాడాయి. ఈసారి దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు సంబరపడ్డరూ కానీ, గడిచిన కొద్ది రోజులుగా వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పులు మామిడి పూతను కింద రాలేలా దెబ్బతీస్తున్నాయి.
ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో మామిడి చెట్లకు పూత బాగా వచ్చింది. ఈసారి కాపు ఎక్కువగా ఉంటుందని రైతులు భావించారు. అయితే, గత నెల రోజులుగా వాతావరణ మార్పులతో మామిడి పువ్వు వచ్చే సమయంలో తామర పురుగుల సమస్య ఎక్కువైంది. దీంతో కొమ్మలకు బూజుపట్టి పిందెలు, లేత మామిడి కాయలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొగమంచు, అకాల జల్లులు, రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పూత ఎండిపోయి రాలిపోతోంది.
ముఖ్యంగా మామిడి తోటలను లీజు (కౌలు) తీసుకొన్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నాం అని అంటున్నారు. కేవలం వాతావరణమే కాదు, చీడపీడల తాకిడి కూడా తోటలను వదలడం లేదు. ముఖ్యంగా తేనెమంచు పురుగు, బూడిద తెగులు కూడా ఈ మామిడి పూతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పూత దశలో ఉన్నప్పుడు పురుగు రసాన్ని పీల్చడం వల్ల పిందె కట్టకుండానే రాలిపోతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రకృతి ప్రకోపం ఒకవైపు, చీడపీడల భయం మరోవైపు మామిడి రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
