సంక్రాంతి పండుగను వినూత్నంగా జరుపుకుంటున్న గ్రామస్తులు.. ఇక్కడ ఏం చేస్తారంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటైన మూడు రోజుల పండుగ.. సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంతా స్వగ్రామాలకు వెళ్లి సంబురాలు చేసుకుంటుంటారు. అనేక కార్యక్రమాలతో సందడి చేస్తుంటారు. కానీ, ఈ గ్రామంలో అందరికీ భిన్నంగా సంక్రాంతి వేడుకలు వినూత్నంగా జరుగుతాయి. సంక్రాంతి పండుగను వినూత్నంగా జరుపుకునే గ్రామమేదో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, హరిదాసులు. ఇవన్నీ పండుగ పూట పల్లెల్లో కనిపించే అందాలు. ఈ పండుగ కోసం ఎక్కడా ఉన్న స్వగ్రామాలకు జనం తరలి వస్తుంటారు. చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. కానీ యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మాత్రం సంక్రాంతి పండుగను అందరికీ భిన్నంగా వినూత్నంగా స్థానికులు జరుపుకుంటారు. భోగి రోజు గౌడ, ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామికి బోనాలు సమర్పిస్తారు.
మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి ఆలయాల వద్ద ప్రదక్షిణలు చేసి దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. భోగికి ముందు రోజు పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద గణపతి పూజ, అభిషేకం, హోమాన్ని ముదిరాజ్ కులస్తులు నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు గ్రామాన్ని వదిలి వన భోజనాలకు వెళ్లడం విశేషం. కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామికి రెండు దశాబ్దాలుగా భోగి రోజున బోనాలు నిర్వహిస్తున్నారు. బిక్కేరు వాగు వద్ద జామ చెట్ల బావి, అమ్మనబోలు రూట్‌లో ఉన్న కంఠమహేశ్వర స్వామి ఆలయాల వద్దకు గౌడ మహిళలు తీపి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించు కుంటారు. సంక్రాంతి రోజున వన మైసమ్మ, రేణుక ఎల్లమ్మ దేవతలకు మేకపోతులు, కోళ్లు బలి ఇస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..