TS Inter Results: ‘కొడుకా.. ముందే చనిపోతివి! గిప్పుడేమో ఇన్ని మార్కులతో పాసైతివి’
ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదనీ.. ఫెయిల్ అవుతానేమోనని ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ రోజు విడుదలైన ఇంటర్ ఫలితాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికుల..
ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదనీ.. ఫెయిల్ అవుతానేమోనని ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ రోజు విడుదలైన ఇంటర్ ఫలితాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ (19) బైపీసీ విభాగంలో గత నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల అనంతరం ఏప్రిల్ 10వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బాగా చదవలేకపోయానని, ఇంటర్ పరీక్షల లక్ష్యసాధనలో వెనుకబడుతున్నానని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ రోజు (మంగళవారం) వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో 892/1000 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.
తమ బిడ్డ అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణుడైన విషయం తెలుసుకొని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షల్లో పాస్ అయ్యి జీవితంలో ఫెయిల్ అయ్యాడని కుటుంబ సభ్యులు రోధించారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సరం ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 4,33,082 మంది హాజరుకాగా వీరిలో 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.