Telangana: అయ్యో ఎంత పని చేశావు చిన్నా.. జాతరకు వెళ్లేందుకు రూ.100 ఇవ్వలేదని బలవన్మరణం
క్షణికావేశం నిండు బాలుడు ప్రాణం తీసింది. తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులను అపార్థం చేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పపడ్డాడు ఒక బాలుడు. ఈ తీవ్ర విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకు ఆ బాలుడికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఎందుకొచ్చింది. అలసు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామానికి చెందిన సిరంజి శ్రీనివాసులు, ప్రభావతి వ్యవసాయ ఆధారిత కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్దకుమారుడు యశ్వంత్ ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం, చిన్న కుమారుడు విజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదిన బుధవారం కార్తీక పౌర్ణమి రోజున చిన్న కుమారుడు విజయ్ స్నేహితులతో కలిసి కురుమూర్తి జాతరకు వెళ్దామని అనుకున్నాడు. ఇందుకోసం తండ్రి అనుమతి తీసుకోవడంతో పాటు.. ఖర్చులకు రూ.100 అడిగాడు. అయితే అదే రోజున మొక్కజోన్న శుద్దీ చేసే మిషన్ పొలం వద్దకు వస్తున్నదని అక్కడ పని ఉంటుంది. ఆ పని పూర్తయ్యాక వెళ్లు అని చెప్పాడు.
అయితే స్నేహితులంతా వెళ్లిపోతున్నారని డబ్బులు ఇవ్వకుండా తన తండ్రి వెళ్లనివ్వలేదని విజయ్ మనస్థాపం చెందాడు. ఇదే విషయాన్ని తల్లి ప్రభావతికి చెప్పడంతో సర్దిచెప్పి తండ్రితో డబ్బులు ఇప్పించింది. కానీ అప్పటికే స్నేహితులు వెళ్లిపోయారు. దీంతో బాధ పడుతూనే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు విజయ్. అక్కడే ఆవులకు నీళ్లు త్రాగించి, గడ్డి వేశాడు. విజయ్ మనస్థాపంతో ఉన్నాడన్న విషయాన్ని తల్లి ప్రభావతి పెద్ద కుమారుడు యశ్వంత్‌ఓకు తెలిపి.. గమనిస్తు ఉండాలని చెప్పింది.
ఈ క్రమంలో పొలం వద్ద పని ముగియగానే తమ్ముడిని బైక్ పై ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు యశ్వంత్. కానీ విజయ్ బైక్ పై వచ్చేందుకు నిరాకరించాడు. అన్న యశ్వంత్ ఎంత బ్రతిమాలిన తాను నడుచుకుంటూ వస్తానని విజయ్ చెప్పాడు. ఇక చేసేది లేక తమ్ముడిని ఫాలో అవుతూ వెనకాలె బైక్ పై కొద్ది దూరం వచ్చాడు యశ్వంత్. అయితే ఎలాగో ఇంటికి వస్తున్నాడు కదా అని యశ్వంత్ వెళ్లిపోయాడు.
అన్న వెళ్లిపోవడాన్ని గమనించిన విజయ్ తిరిగి పొలం వద్దకు వెళ్లిపోయాడు. అక్కడే తాడుతో చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి చాలా సమయం అవుతున్నా చిన్నవాడు రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే పొలం వద్దకు వెళ్లి చూడగా విజయ్ ఉరి తాడుకు వ్రేలాడుతూ కనిపించాడు. అప్పటికే విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కన్నతల్లి రోదనలు మిన్నంటాయి. చిన్న విషయానికి మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకోవడాన్ని తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. ఎప్పుడు హుషారుగా కనిపించే బాలుడి ఆకస్మిక మరణం అటు గ్రామస్థులను సైతం కలచివేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
