April Fool Day: ఏప్రిల్ ఫూల్ అని ఎందుకంటారు..? ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా మావ..
ఏప్రిల్ 1న జరుపుకునే ఫూల్స్ డే వెనుక రెండు ముఖ్యమైన చారిత్రక కథనాలున్నాయి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పుతో, నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఈ మార్పును పాటించనివారిని ఏప్రిల్ ఫూల్స్ అని ఆటపట్టించేవారు. రోమన్ పండుగ హిలారియా కూడా దీనికి మూలంగా కొందరు భావిస్తారు. ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్స్ డేగా ఎందుకు ప్రసిద్ధి చెందిందో తెలుసుకుందాం..

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులను సరదాగా ఆటపట్టించేందుకు చిన్నచిన్న అబద్ధాలు చెబుతూ, ప్రాంక్‌లు చేస్తూ ఆనందిస్తారు. అయితే, ఈ విచిత్రమైన సంప్రదాయం వెనుక ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చరిత్ర ఉంది. దీని పుట్టుకపై అనేక సిద్ధాంతాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్స్ డే పుట్టుకపై అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన కథనం 16వ శతాబ్దానికి చెందినది. 1582కు ముందు, యూరప్‌లోని చాలా ప్రాంతాలలో జూలియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని మార్చి 25 నుండి ఏప్రిల్ 1 వరకు జరుపుకునేవారు. ఈ సమయంలో జరిగే వేడుకలలో నూతన సంవత్సర పండుగ ఏప్రిల్ 1న ముగిసేది. అయితే, 1582లో పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త క్యాలెండర్ ప్రకారం, నూతన సంవత్సరం జనవరి 1కి మారింది.
గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పు గురించిన వార్తలు నెమ్మదిగా వ్యాపించాయి. కొంతమందికి ఈ మార్పు గురించి తెలియదు లేదా వారు దీనిని అంగీకరించడానికి నిరాకరించారు. వారు ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం కొనసాగించారు. అలాంటి వారిని ఏప్రిల్ ఫూల్స్ లేదా ఏప్రిల్ ఫిష్ అని ఆటపట్టించడం మొదలుపెట్టారు. వారి వెను కాగితపు పోస్టర్లు లేదా చేప బొమ్మలు తగిలించి ఆటపట్టించేవారట. ఈ సరదా సంప్రదాయం కాలక్రమేణా ఏప్రిల్ ఫూల్స్ డేగా రూపాంతరం చెందిందని చాలా మంది చరిత్రకారులు చెబుతారు. ఇలా ‘ఏప్రిల్ ఫూల్స్’ కాస్తా.. ఏప్రిల్ ఫూల్స్ డేగా స్థిరపడిందంట.
మరొక సిద్ధాంతం ప్రకారం, ఏప్రిల్ ఫూల్స్ డే అనేది ప్రాచీన రోమన్ల హిలారియా పండుగ నుండి ఉద్భవించి ఉండవచ్చు. మార్చి నెల చివరిలో జరుపుకునే ఈ పండుగలో ప్రజలు తమ దైనందిన జీవితంలోని నియమాలను పక్కనబెట్టి, సరదాగా వినోదాలు, ఆటపాటలలో పాల్గొనేవారు. దేవత సిబెలేను ఆరాధించిన తర్వాత, ప్రజలు వేషధారణలు ధరించి, సరదాగా జోక్స్ చెప్పుకుంటూ, ఒకరినొకరు నవ్విస్తూ ఆనందంగా గడిపేవారు. ఈ పండుగలో భాగమైన సరదా, హాస్యం, ఒకరినొకరు ఆటపట్టించే సంప్రదాయం క్రమంగా ఏప్రిల్ 1న ఫూల్స్ డేగా పరిణామం చెందిందని కొందరు విశ్లేషకులు భావిస్తారు.
ఈ రెండు ప్రధాన కథనాలతో పాటు, ఏప్రిల్ ఫూల్స్ డే పుట్టుకపై అనేక ఇతర జానపద కథలు, ప్రాంతీయ నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ రోజున తోటివారిని సరదాగా ఆటపట్టించడం, నవ్వులు పంచడం అనేది ప్రధాన ఉద్దేశ్యం. కొందరు ఈ సరదాను మితిమీరి తీవ్రమైన ప్రాంక్‌లకు దారి తీసేలా చేయడం కరెక్ట్ కాదు.. ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం మాత్రం తేలికపాటి హాస్యాన్ని పంచడమే. ఏప్రిల్ ఫూల్స్ డే అనేది మానవ చరిత్రలో నవ్వు, ఆనందం, సరదాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఈ దేశాల్లో నిషేధం..
ఏప్రిల్ ఫూల్స్ డేను ప్రపంచవ్యాప్తంగా సరదాగా జరుపుకుంటారు. కానీ.. చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మాత్రం ఏప్రిల్ ఫూల్స్ వేడుకలపై ఆంక్షలున్నాయి.. అబద్ధపు వార్తలు, ఎగతాళి చేయడం లాంటివి సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తాయనే కారణంతో అక్కడి ప్రభుత్వాలు దీనిని ప్రోత్సహించడం లేదని సమాచారం..
ఏప్రిల్ ఫూల్స్ అంటే జస్ట్ సరదా కోసం మాత్రమే.. కాసేపు ఒత్తిడిని పక్కన పెట్టి, అందరితో కలిసి నవ్వుకోవడమే దీని ఉద్దేశ్యం.. కానీ, మితి మీరి ప్రవర్తించొద్దు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
