నాన్ స్టిక్ vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మన వంటలకు ఏ పాత్రలు వాడితే మంచిది..? ఈ తప్పులు చేయకండి..
భారతీయ వంటగది అంటేనే రకరకాల రుచులు, సుగంధ ద్రవ్యాల కలయిక. అయితే వంట ఎంత ముఖ్యమో, వండే పాత్రలు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ నాన్ స్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. తక్కువ నూనెతో వండటానికి నాన్ స్టిక్ ఉపయోగపడితే, ఎక్కువ కాలం మన్నడానికి స్టీల్ పాత్రలు తోడ్పడతాయి. మన వంటల శైలికి ఈ రెండింటిలో ఏది మంచిది..? అనేది తెలుసుకుందాం..

భారతీయ వంట శైలి చాలా ప్రత్యేకమైనది. రకరకాల మసాలాలు దట్టించడం, నూనె సాస్‌లతో ప్రయోగాలు చేయడం, ఎక్కువ సేపు సన్నని మంట మీద ఉడికించడం లేదా హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేయడం మన అలవాటు. అయితే ఈ రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి మన వంటగదిలో ఎలాంటి పాత్రలు వాడాలి? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆధునిక నాన్ స్టిక్ పాత్రలు మంచివా? లేక సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఉత్తమమా? ఈ చర్చకు ఎప్పటికీ అంతుండదు. ఈ రెండింటిలో ఏ పాత్రల వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకుందాం..
నాన్ స్టిక్ పాత్రలు
ఉదయాన్నే వేడివేడి దోసెలు, కరకరలాడే ఆమ్లెట్లు, వేయించిన గుడ్లు లేదా మెత్తటి పాన్‌కేక్‌ల వంటి తేలికపాటి వంటకాలకు నాన్ స్టిక్ పాత్రలు అమృతం లాంటివి. తక్కువ నూనె లేదా వెన్నతో హెల్తీగా వంట చేయాలనుకునే వారికి ఈ ఆధునిక పాత్ర ఎల్లప్పుడూ మొదటి ఎంపికగా ఉంటుంది. ఆహారం అడుగున అంటుకుంటుందనే భయం ఉండదు. పైగా వంట పూర్తయిన తర్వాత క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. అయితే నాన్-స్టిక్ పాత్రల ప్రధాన లోపం ఏమిటంటే.. అవి అత్యధిక వేడిని అస్సలు తట్టుకోలేవు. అధిక వేడి మీద క్రమం తప్పకుండా వంట చేయడం వల్ల ఈ పాత్రలపై ఉండే ప్రత్యేక రసాయన పూత దెబ్బతింటుంది. అలాగే వీటిలో స్టీల్ గరిటెలు వాడితే గీతలు పడి, కోటింగ్ ఊడిపోయి ఆ పాత్రలు చాలా త్వరగా నిరుపయోగంగా మారుతాయి. సాధారణంగా ఒక అత్యుత్తమ నాన్ స్టిక్ పాన్ ఆయుష్షు 3 నుండి 5 సంవత్సరాలు మాత్రమే.
స్టెయిన్‌లెస్ స్టీల్
నాన్ స్టిక్‌లోని రసాయన పూతల భయం కారణంగానే ప్రస్తుతం ఆరోగ్య స్పృహ ఉన్నవారంతా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు పెద్ద పెద్ద హోటళ్లలోని ప్రొఫెషనల్ చెఫ్‌ల కిచెన్లలో చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించడం, డీప్ ఫ్రై చేయడం, పప్పు, సాంబార్, మాంసం లేదా సూప్‌లు తయారు చేయడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ అత్యుత్తమమైనది. ఇది ఎంతటి అధిక వేడిని అయినా తట్టుకోగలదు. దీనిలో ఎలాంటి కృత్రిమ రసాయన పూతలు ఉండవు కాబట్టి ఎక్కువ వేడి వద్ద కూడా ఆహారంలోని పోషక విలువలు చెక్కుచెదరకుండా ఉండి, ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వీటికి గీతలు పడతాయనే భయం ఉండదు కాబట్టి మీరు స్టీల్ గరిటెలను నిర్భయంగా వాడవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇవి దశాబ్దాల పాటు కొత్తవాటిలా మన్నుతాయి. కొత్తగా వంట నేర్చుకునే వారికి స్టెయిన్‌లెస్ స్టీల్ వాడేటప్పుడు ఉష్ణోగ్రత సరిగ్గా అర్థం కాకపోతే ఆహారం అడుగున అంటుకుపోయే లేదా మాడిపోయే ప్రమాదం ఉంది.
వంటగదిలో ఏది ఉండాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక భారతీయ కుటుంబ వంట అవసరాలకు అనుగుణంగా కేవలం ఒక్క రకం పాత్రలపైనే ఆధారపడకుండా, రెండింటి మిశ్రమాన్ని కలిగి ఉండటం చాలా మంచిది.
స్టీల్ పాత్రలు దేనికి?: ప్రతిరోజూ వండే పప్పులు, కూరలు, నాన్-వెజ్ వంటకాలు, ఎక్కువ సేపు మరిగించే చారు, సాంబార్ వంటి వాటికి స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలనే వాడండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ కాలం మన్నుతుంది.
నాన్-స్టిక్ దేనికి?: మీ ఉదయపు అల్పాహారం కోసం నూనె లేకుండా ఆమ్లెట్లు, చపాతీలు లేదా దోసెలు వేసుకోవడానికి క్యాబినెట్‌లో ఒక మంచి నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌ను ప్రత్యేకంగా ఉంచుకోండి. వాటిని కేవలం తక్కువ వేడి మీద చేసే వంటలకే పరిమితం చేయండి.
