AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T BJP: పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ నిజమేనా..? కాషాయదళంలో ఏం జరుగుతోంది..?

తెలంగాణ కమలంలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

T BJP: పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ నిజమేనా..? కాషాయదళంలో ఏం జరుగుతోంది..?
Telangana Bjp
Vidyasagar Gunti
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 03, 2024 | 7:47 PM

Share

తెలంగాణ కమలంలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు కనీసం రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయలేకపోతుందట.

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా… బీజేపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదట. తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నా… రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదట. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నలుగురు.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలే లేవు. స్టేట్ బీజేపీ జనరల్ సెక్రటరీలుగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ రావు, బంగారు శృతి ఎవరికి వారు ఉనికి కోసం పోరాటం చేస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి రుణమాఫీపై రైతు హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేదట. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా వారి ఫోటోలు ముద్రించలేదు. ఇది కాస్తా అగ్గి రాజేసింది.

బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి పార్టీలో కీలకమైన పదవి. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలే అసహన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైతు రుణమాఫీపై అసెంబ్లీ వరకు బీజేఎల్పీ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం డైరెక్షన్స్ లేకపోవడంతో.. పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో బీజేపీలో అసలు ఎం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. పార్టీ నుంచి క్లారిటీ లేకపోవడంతో… ఎమ్మెల్యేలకు సరైన దిశానిర్దేశం అందడం లేదని పలువురు పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పార్టీలో నేతలు వ్యవహార శైలి ఉందని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఉనికి కోసం ఎవరి ఆరాటం వారిదే అన్నట్లుగా ఉందట. జరగుతున్న వాస్తవ పరిణామాలపై సరైన నివేదికలు అందకపోవడంతో.. బీజేపీ అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలోనూ నేతల మధ్య విభేదాలతో వైఫల్యం చెందుతున్నారని అసెంబ్లీ వేళ అర్ధం అవుతుంది. అంతర్గత వివాదాలను పార్టీ హైకమాండ్ ఏ విధంగా సరిదిద్దుతుందో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..