Prashant Kishor: ప్రధాని మోడీని టీఆర్ఎస్ టార్గెట్‌ చేయడం వెనుక పీకే వ్యూహం..

అనూహ్యంగా బిజెపి హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణలో అధికారం లక్ష్యంగా ఏర్పాటు చేసిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ఏమాత్రం లబ్దిచేకూరకూడదని భావించిన కేసీఆర్ పదునైన వ్యూహాన్ని ఎంచుకున్నారు.

Prashant Kishor: ప్రధాని మోడీని టీఆర్ఎస్ టార్గెట్‌ చేయడం వెనుక పీకే వ్యూహం..
Pk Kcr
DONTHU RAMESH - Input Editor

| Edited By: Shaik Madarsaheb

Jul 06, 2022 | 7:20 PM

Telangana Politics – Prashant Kishor: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌‌లో పర్యటించిన సందర్భంలో టీఆర్‌ఎస్‌ వినూత్న ప్రచార కార్యక్రమాలతో కేంద్ర వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నించింది. బ్యాంకుల ప్రైవేటీకరణ మొదలుకొని, ఎల్ఐసీలో వాటాల విక్రయం వరకు అనేక అంశాలపై నేరుగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేపట్టింది. దీనికి జాతీయ మీడియాతో రాష్ట్ర మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చింది. దీనితోపాటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనతో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న అభిప్రాయం నెలకొంది. ఓ రకంగా మీడియా ఫోకస్ పూర్తిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ పర్యటనపై పడకుండా చూడటంలో టీఆర్ఎస్ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్ అనుసరించిన ప్రధాని మోడీ ధిక్కార వ్యూహాన్ని తెరవెనుక ఉండి నడిపించింది అంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అని తెలుస్తోంది. పీకే సలహాలు, సూచనలు మేరకే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ పకడ్బందీగా మోదీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తెలంగాణ దండయాత్రను తిప్పికొట్టినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా బీజేపీ హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణలో అధికారం లక్ష్యంగా ఏర్పాటు చేసిన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ఏమాత్రం లబ్దిచేకూరకూడదని భావించిన కేసీఆర్ పదునైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. మోదీ వస్తున్నారని తెలియగానే అప్పటికప్పుడు కేసీఆర్‌ రాష్ట్రపతి అభ్యర్ది ప్రచారం పేరుతో యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌ రప్పించారు. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హంగామా, హడావుడి నడస్తుండగానే యశ్వంత్‌ సిన్హాను జలదృశ్యానికి రప్పించిన కేసీఆర్.. రాష్ట్రపతి ప్రచారం పక్కకు పెట్టి మోడీ పైన పదునైన బాణాలు విసిరారు. మోదీ విధానాలను తుర్పారబడుతూ.. దేశాన్ని మోదీ అదోగతిపాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నది ఉన్నట్లు రేపటి సభలో చెప్పాలంటూ సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా నగరం మొత్తం బిజెపి ప్లెక్సీలు, హోర్టింగ్‌లకు పోటీగా కోట్ల రూపాయలు వెచ్చించి టీఆర్ఎస్ ప్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టించారు. దీంతోపాటు ప్రసారమాద్యమాలలో కోట్ల రూపాయల ప్రకటనలు వచ్చిపడ్డాయి.

2015లో బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) నేత నితీష్ కుమార్ కోసం పీకే పనిచేసినప్పుడు బీహార్‌లో ఉపయోగించిన అదే వ్యూహాన్ని పీకే తెలంగాణలో పునరావృతం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. “జులై 2015లో ముజఫర్‌నగర్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగించేందుకు మోడీ పాట్నాలో దిగడానికి ముందు, నితీష్ కుమార్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోనూ బేగంపేట విమానాశ్రయంలో దిగడానికి కొన్ని గంటల ముందు మోడీ మాతృభాష గుజరాతీలో మంత్రి కేటీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు.

జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, నల్లధనం, పీఎస్‌యూలు, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై మోదీని టార్గెట్‌ చేస్తూ కేటీఆర్ మోదీకి 15 ప్రశ్నలు సంధించారు. ఇదంతా పీకే వ్యూహంలో భాగంగానే జరిగింది. అయితే బీహార్‌లో మోడీ అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు కానీ ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ వేసిన ఒక్క ప్రశ్నకు స్పందించలేదు. అంతేకాకుండా కనీసం ప్రసంగంలో కేసీఆర్‌ పేరు కూడా ఎత్తలేదు.

తన సంధించిన ప్రశ్నలతో మోదీని ఉచ్చులోకి లాగాలనుకున్న కేసీఆర్‌,  ఆయన వెనుక ఉన్న పీకే వ్యూహంలో ప్రధాని నరేంద్ర మోడీ చిక్కుకుండా తప్పించుకోగలిగారు. తన తరువాత ఉన్న ద్వితీయ శ్రేణి నేతలతో కేసీఆర్‌పై, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగేలా చేసిన మోదీ తాను మాత్రం సాదాసీదా ప్రసంగంతో కేసీఆర్‌ ఊసులేకుండా ప్రసంగించి వెళ్లిపోయాడు. ఇంతకు పీకే వ్యూహం ఫలించిందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu