Heavy Rain Alert: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. వచ్చేవారం మళ్లీ కుండపోత వానలు!
IMD warns possibility of low pressure formation in Bay of Bengal tomorrow: తెలుగు రాష్ట్రాల్లో వానలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు వరుస కుండపోత వానలతో నానా బీభత్సం సృష్టించిన వరుణుడు.. మళ్లీ విరుచుకు పడేందుక సిద్ధమయ్యాడు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ క్రమంలో కుండపోత వానలు వచ్చేవారమంతా..

హైదరాబాద్, అక్టోబర్ 10: దక్షిణ ఒడిశా నుండి కోస్తా ఆంధ్ర తీరం రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ, ఏపీ మీదుగా కొనసాగుతున్న ద్రోణికి ఉపరితల ఆవర్తనం తోడైంది. దీని ప్రభావంతో అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రేపటికి (అక్టోబర్ 11) అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
కాగా గడచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో అత్యధికంగా 9.15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మల్కలపల్లిలో 7.55 సెంటీ మీటర్లు, నల్లగొండ జిల్లా తిప్పర్తి 6.78 సెంటీ మీటర్లు, కట్టంగూరులో 5.07 సెంటీ మీటర్లు, నార్కెట్‌పల్లిలో 4.76 సెంటీ మీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో 4.71 సెంటీ మీటర్లు, భూత్పూర్‌లో 4.59 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




