- Telugu News Business Cyber Fraudsters Scam: Alert to those who sell old mobile phones and buy plastic goods
పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం.. మీ ఊరికీ వస్తున్నారా? జర జాగ్రత్త..!
How cyber fraudsters scam people using second-hand mobile phones: సాధారణంగా ఇళ్లల్లో నిరుపయోగంగా పడిఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్ సామాన్లుగానీ కొందరు తీసుకూంటూ ఉంటారు. ఈ జాబితాలో మీరూ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇలా తీసుకెళ్లిన పాత మొబైల్స్ నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయ్..
Updated on: Oct 10, 2025 | 10:39 AM

పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామ్.. అంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పీకల్లోతు చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ఇళ్లల్లో నిరుపయోగంగా పడిఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్ సామాన్లుగానీ కొందరు తీసుకూంటూ ఉంటారు. ఈ జాబితాలో మీరూ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇలా తీసుకెళ్లిన పాత మొబైల్స్ నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయ్..

ఆ నేరగాళ్లు ఈ మొబైల్ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్‌వేర్ సేకరించి, మరమ్మతులు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతారు. ఇలా వచ్చిన డబ్బులో నుంచి ఈ మొబైల్ ఫోన్లను సేకరించి తెచ్చిన వారికి కమీషన్ ఇచ్చి దందా సాగిస్తున్నారు.

ఇలా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఈ దందా సాగుతుంది. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద దుమ్ముగూడెం పోలీసులు అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు బైక్‌లపై వచ్చారు. పోలీసులను చూసీచూడగానే తత్తరపాటుతో వెంటనే వెనుదిరిగి వేగంగా పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు వెంబడించగా బీహార్ రాష్ర్టానికి చెందిన అక్తర్ ఆలీఖాన్ అనే వ్యక్తి దొరికాడు.

ఇతడు పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ ఊరూరా తిరుగుతుంటాడని, పాతవి, పాడైన మొబైల్స్ తీసుకుని ప్లాస్టిక్ సామాన్లు ఇస్తుంటాడని తెలపాడు. ఈ మొబైల్స్‌ను బీహార్‌కు తీసుకెళ్లి.. అక్కడ తన్వీర్, హలీమ్ అనే ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నట్లు తెలిపాడు. పట్టుబడిన ఆలీఖాన్ నుంచి 150 పాత మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




