Aadhaar: ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు షాక్.. ఆ ఛార్జీలు పెంచిన యూఐడీఏఐ.. ఎంత పెరిగాయంటే..?
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను పెంచింది. పేరు, అడ్రస్, బయోమెట్రిక్ వంటి డెమోగ్రాఫిక్ మార్పులకు అయ్యే ఖర్చును భారీగా పెంచింది. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం అప్‌డేట్ సేవలు ఉచితంగా కొనసాగుతాయి. ఛార్జీలు ఎంత పెరిగాయంటే..?

ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇది తప్పక తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఆధార్‌లో డీటెయిల్స్ మార్చుకోవాలంటే అయ్యే ఖర్చు ఇప్పుడు పెరిగింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఛార్జీలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. మీ ఆధార్‌లో పేరు, అడ్రస్ లేదా మొబైల్ నంబర్ వంటి డెమోగ్రాఫిక్ మార్పులు చేయించుకోవాలంటే ఇకపై ఎక్కువ చెల్లించాల్సిందే. అదేవిధంగా ఫింగర్ ప్రింట్, ఫోటో వంటి బయోమెట్రిక్ మార్పులు కూడా కాస్ట్లీ అయ్యాయి. పేరు, అడ్రస్ మార్పుకు ఇంతకుముందు రూ.50 ఛార్జీలు ఉండేవి. ఇప్పుడు అవి రూ.75కు పెరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్, ఫొటో మార్చుకోవడానికి గతంలో రూ.100 ఛార్జీ ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.12కు పెంచారు.
సామాన్యులకు భారం పెంచినప్పటికీ పిల్లలకు సంబంధించిన కొన్ని తప్పనిసరి అప్‌డేట్‌లు మాత్రం ఉచితంగా లభిస్తాయి. నవజాత శిశువులకు ఆధార్ నమోదు, అలాగే 5 ఏళ్లు, 15 ఏళ్ల వయస్సులో తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్‌లు ఉచితంగా అందించడం కొనసాగుతుంది. 5 ఏళ్లు, 5 నుంచి 7ఏళ్లు, 15 నుంచి 17ఏళ్ల వయస్సులోపిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు తప్పనిసరి చేయించాలి.
ఇంటి వద్దకే ఆధార్ సేవలు మరింత ఖరీదైనవి
ఆధార్ నమోదు కేంద్రాలకు రాలేని వ్యక్తుల కోసం ఇంటి వద్దకే ఆధార్ సేవలను కూడా UIDAI అందిస్తోంది. అయితే ఈ సేవలు కూడా ఇప్పుడు ఖరీదైనవిగా మారాయి. నమోదు లేదా అప్‌డేట్స్ కోసం హోమ్ విజిట్ ధర జీఎస్టీతో సహా రూ. 700కు పెరిగింది. ఒకే ఇంటి నుండి ఒకరి కంటే ఎక్కువ మంది నివాసితులు ఈ సేవను ఉపయోగించుకుంటే, మొదటి వ్యక్తికి రూ. 700 వసూల్ చేసిన తర్వాత ప్రతి అదనపు సభ్యుడికి రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఆధార్‌లో మార్పులు చేసుకోవాలనుకునే వారు సవరించిన ఈ కొత్త రేట్లను గమనించాలని UIDAI అధికారులు సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








