Lunar Eclipse Born: అదృష్టవంతులవుతారా..? చంద్రగ్రహణం సమయంలో జన్మించిన పిల్లల లైఫ్ ఎలా ఉంటుందంటే.?
Lunar Eclipse Birth: 2026 సంవత్సరంలో సంభవించనున్న చంద్రగ్రహణం అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. భారతీయ సంస్కృతిలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని పెద్దలు సలహా ఇస్తారు. గ్రహణ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పూర్వీకుల నమ్మకం. గ్రహణ సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులు ఉపయోగించకూడదని, ఆహారం తీసుకోకూడదని, ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేయాలని సూచిస్తారు.

పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించడం జ్యోతిషశాస్త్ర పరంగా విశేషంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3న, ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. సింహ రాశి, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంభవించే ఈ గ్రహణం మొత్తం 3 గంటల 27 నిమిషాల పాటు కొనసాగి, సంవత్సరంలోనే అతి పొడవైన చంద్రగ్రహణంగా నిలుస్తుంది. మతపరమైన దృక్కోణంలో గ్రహణాన్ని సాధారణంగా అశుభంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సమయంలో కొన్ని ఆచారాలు, జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని పెద్దలు సూచిస్తారు. అయితే ఇవి సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడినవే.
చంద్రగ్రహణ సమయంలో జన్మించిన పిల్లల స్వభావం
జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. చంద్రగ్రహణ సమయంలో చంద్రుని కాంతి క్షీణించడం వల్ల ఆ రోజున జన్మించిన పిల్లలు భావోద్వేగపరులు, సున్నిత స్వభావం కలవారిగా ఉంటారని నమ్మకం. చిన్న విషయాలనూ హృదయపూర్వకంగా స్వీకరించే స్వభావం వీరిది. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. ద్రోహం చేయని నమ్మకస్తులుగా పేరుపొందుతారు.
అదృష్టం, వ్యక్తిత్వ వికాసం
చంద్రగ్రహణ సమయంలో జన్మించిన పిల్లలు అదృష్టవంతులని జ్యోతిష్యులు చెబుతారు. తమ కృషి, పట్టుదలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందగలరు. ముఖ్యంగా పరిశోధన, సృజనాత్మక రంగాలు, ఆలోచనా ఆధారిత వృత్తుల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం వీరి బలాలు.
గొప్ప విజయాలు
అయితే కొన్నిసార్లు ఆత్మవిశ్వాస లోపం లేదా భావోద్వేగ ఆందోళనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సరైన ప్రోత్సాహం, కుటుంబ మద్దతు, సానుకూల వాతావరణం లభిస్తే వీరు గొప్ప విజయాలను సాధించగలరు. మొత్తంగా చెప్పాలంటే, చంద్రగ్రహణ సమయంలో జన్మించడం శుభమో అశుభమో కంటే.. ఆ పిల్లల పెంపకం, పరిసరాలు, విద్య, ప్రోత్సాహమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
