Heavy Rains: తెలంగాణలోని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains: తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు..
Heavy Rains: తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు పేర్కొంది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
నేడు, రేపు భారీ వర్షాలు…
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న వెల్లడించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.