Minister Harish Rao: నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు.. యూకే వైద్యులను అభినందించిన మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌లు చేసిన యూకే వైద్య బృందాన్ని మంత్రి హరీష్‌రావు శనివారం సన్మానించారు. 100 మంది చిన్నారుల్లో..

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌లు చేసిన యూకే వైద్య బృందాన్ని మంత్రి హరీష్‌రావు శనివారం సన్మానించారు. 100 మంది చిన్నారుల్లో ఒకరికి గుండెపోటు సమస్య ఉందని, వీరికి శస్త్ర చికిత్స అందించలేక నిరుపేద కుటుంబాలు చిన్నారులను కోల్పోతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్త ఆస్పత్రులను నిర్మిస్తూ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనే తొలిసారిగా గుండెశస్త్ర చికిత్సలు జరిగాయని, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగిన గుండె శస్త్ర చికిత్సల వైద్య శిబిరంలో 9 మంది పసి పిల్లలకు ప్రాణాలు పోసిన వైద్య బృందానికి మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. 3 నెలల చిన్నారికి చేసిన సర్జరీ విజయవంతమైందని తెలిపారు.
సొంతగడ్డపై సేవలు అందించేందుకు ముందుకు రావాలి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వైద్య నిపుణులు సొంతగడ్డపై వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. ప్రసావ భారతీయుడైన డాక్టర్ రమణన నేతృత్వంలో పది మంది వైద్యులు, నర్సుల బృందం చేసిన సేవలను మంత్రి హరీష్‌రావు కొనియాడారు. డాక్టర్ రమణను స్ఫూర్తిగా తీసుకుని అమెరికా, యూకే లాంటి దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్య నిపుణులు రాష్ట్రంలో పేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలన్నారు.
హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
ఇక వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్‌లో నాలుగువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో 2వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీని ఈ ఏడాది దసరా పండగ వరకు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా మెడికల్ విద్యార్థుల కోసం అధునాతన టెక్నాలజీతో కూడిన సదుపాయాలతో ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సుమారు 6 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీని నిర్మిస్తున్నామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




