Nehru Zoological Park: ప్లాన్ ఆ నలుగురిదే.. స్మగ్లర్లతో చేతులు కలిపారు.. గుట్టుగా పని కానిచ్చేశారు..
Nehru Zoological Park Hyderabad: నెహ్రు జూలాజికల్ పార్క్‌లో గంధపు చెట్ల స్మగ్లింగ్ వెనుక ఇంటి దొంగల పాత్ర బయట పడింది. అందరూ అనుకున్నట్టుగానే స్మగ్లర్లతో సిబ్బంది చేతులు కలిపి విలువైన గంధపు చెట్లను మాయం చేశారు.

హైదరాబాద్, జులై 24: నెహ్రు జూలాజికల్ పార్క్‌లో గంధపు చెట్ల స్మగ్లింగ్ వెనుక ఇంటి దొంగల పాత్ర బయట పడింది. అందరూ అనుకున్నట్టుగానే స్మగ్లర్లతో సిబ్బంది చేతులు కలిపి విలువైన గంధపు చెట్లను మాయం చేశారు. వన్యప్రాణుల ఉండే డేంజర్ జోన్ లోకి స్మగ్లర్లు వెళ్లేందుకు నలుగురు సిబ్బంది సహకరించినట్టు దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఇదే క్రమంలో స్మగ్లర్ల దృశ్యాలు కంట పడకుండా సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రూర మృగాలు ఉండే జోన్‌లో గంధపు చెట్ల మార్కింగ్ వివరాలను స్మగ్లర్లకు అందజేసారు జూ సిబ్బంది. నలుగురు సిబ్బంది కనుసన్నల్లోనే చెట్ల నరికివేత జరిగినట్టు తేల్చారు అధికారులు. జూ సిబ్బందికి ఉండే వాహనాల్లోనే స్మగ్లర్లను వెంట తీసుకుని వెళ్లి అక్కడి నుండి గంధపు దుంగలను ప్రహరీ గోడ దాటించినట్టు అధికారులు గుర్తించారు.
గతంలో జరిగిన స్మగ్లింగ్ వెనుక కూడా వీరి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేసి ఆరు సార్లు స్మగ్లింగ్ కు పాల్పడినట్టు భావిస్తున్నారు. జూ సిబ్బంది సమక్షంలో అధికారులు గంధపు చెట్ల మార్కింగ్ చేశారు. అదే సమయంలో అధికారుల వెంట వెళ్లిన సిబ్బంది లో నలుగురు ఈ స్మగ్లింగ్ కి స్కెచ్ వేశారు. జూలో ఉన్న విలువైన గంధపు చెట్ల వివరాలను స్మగ్లర్లకు చెప్పిన నలుగురు సిబ్బంది.. వారి సూచనల ప్రకారం వ్యవహరించనట్టు గుర్తించారు.
నెహ్రూ జూ పార్క్ పరిసరాల్లో అణువణువు ఈ సిబ్బందికి పట్టు ఉండటంతో సునాయాసంగా గంధపు చెట్లను దాటించారు. గత అనుభవాల దృశ్యా జూలో సెక్యురిటీ పెంచి సీసీ కెమెరాలు అమర్చిన స్మగ్లింగ్ అడ్డుకట్టు వేయలేకపోయారు. ఇంటి దొంగలే ఈ స్మగ్లింగ్ వెనుక ఉండటంతో అధికారులే ఆశ్చర్యపోయారు. ఇకపై వన్యప్రాణుల ఉండే డేంజర్ జోన్ లో పని చేసే సిబ్బంది కదలికల నిఘా పెట్టడంతో పాటు.. ప్రతి వారంలో మార్కింగ్ చేసిన గంధపు చెట్లను తనిఖీ చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు జూ క్యూరేటర్‌ను ఆదేశించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..




