AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటు రాజకీయ రచ్చ.. ఇటు సినిమా కష్టాలు! అరవ రాజకీయాల్లో తలపతి ఒంటరేనా!

అనుకున్నంత ఈజీ కాదేమో.. రాజకీయమంటే!!! అందరికీ అచ్చిరాదేమో... పాలిటిక్స్‌ అంటే!!! ఎంత తోపులైనా.. అక్కడికెళ్తే డక్కాముక్కీలు తినకుండా ఉండటం చాలాచాలా కష్టమేమో. ముప్పేట దాడి కాదు.. నలుదిక్కుల నుంచి నాన్‌స్టాప్‌ రోస్టింగ్‌లా పరిస్థితి ఉంటే... ముందుకు సాగడం గగనమైపోతుంది. అరవ రాజకీయాల్లో... విజయ్‌ సిట్యుయేషన్‌ చూస్తుంటే... ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది.

అటు రాజకీయ రచ్చ.. ఇటు సినిమా కష్టాలు! అరవ రాజకీయాల్లో తలపతి ఒంటరేనా!
Tvk Chief Actor Vijay
Balaraju Goud
|

Updated on: Mar 10, 2026 | 8:25 AM

Share

అనుకున్నంత ఈజీ కాదేమో.. రాజకీయమంటే!!! అందరికీ అచ్చిరాదేమో… పాలిటిక్స్‌ అంటే!!! ఎంత తోపులైనా.. అక్కడికెళ్తే డక్కాముక్కీలు తినకుండా ఉండటం చాలాచాలా కష్టమేమో. ముప్పేట దాడి కాదు.. నలుదిక్కుల నుంచి నాన్‌స్టాప్‌ రోస్టింగ్‌లా పరిస్థితి ఉంటే… ముందుకు సాగడం గగనమైపోతుంది. అరవ రాజకీయాల్లో… విజయ్‌ సిట్యుయేషన్‌ చూస్తుంటే… ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది.

అరవ రాజకీయాల్లో తలపతి విజయ్‌ గురించి ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది. ఎంట్రీ జరిగినంత అలవోకగా.. ఆయన పొలిటికల్‌ ప్రయాణం సాగడం లేదు. ఎంత సూపర్‌ స్టార్‌ అయితే ఏంటి.. తమిళ వెట్రి కళగం అధినేతకు పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నట్టే ఉంది పరిస్థితి. అన్నీ సగంలోనే.. అంతా సగంలోనే.. బీస్ట్‌ రోస్ట్‌ అన్నట్టుగా మారింది తలపతి సిట్యుయేషన్‌. అటు ఆఖరి సినిమా.. ఇటు కొత్తగా పొలిటికల్‌ జర్నీ.. మరోవైపు సిబీఐ కేసులు.. ఇంకోవైపు ఫ్యామిలీ ఇష్యూస్‌… ఇలా నలుదిక్కులు నాన్‌స్టాప్‌ కష్టాలు అన్నట్టుగా ఉన్నాయ్‌ పరిస్థితులు. ఏ దిక్కు నుంచి ఎప్పుడు ఏ పిడుగు పడుతుందో అర్థం కావట్లేదు ఈ రీల్‌ హీరోకి..!

సినిమాలు వదిలేసి రాజకీయం చేద్దామని వచ్చిన విజయ్‌.. ఇప్పటికీ పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టలేదు. ఎక్కడికెళ్లినా కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న అభిమాన గణమే తప్ప…. పార్టీ వ్యవస్థీకృత నిర్మాణం ఇంకా పూర్తిగా జరగలేదు. ఎన్నికలేమో.. ఎంతో దూరంలో లేవు. దీంతో, పైస్థాయి నాయకత్వమే తప్ప.. కింది స్థాయిలో పార్టీని పటిష్ట పరిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం విజయ్‌ ఇమేజ్‌ మాత్రమే ఇప్పటికీ టీవీకే ప్రధాన బలంగా తెలుస్తోంది. అంతేకాదు, ఎన్నికల్లో కలిసి వెళ్లే పొత్తులు కూడా లేక.. ఒంటరిగా మిగిలిపోయింది టీవీకే పార్టీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను విజయ్‌ ఎలా ఎదుర్కొంటారన్నది పొలిటికల్‌ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. అదే వేదికపై ఎన్నికల హామీలు ప్రకటిస్తూ.. కొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ విషయంలో పరోక్షంగా విజయ్‌ని టార్గెట్‌ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. ఎన్నికల హామీలను కొందరు ఇన్‌స్టాల్మెంట్స్‌లో ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. డీఎంకే పథకాలను కాపీ కొడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

రాజకీయంగా ఇలా ఉంటే.. మరోవైపు ఇండస్ట్రీ పరంగానూ.. ఇరకాటంలో పడిపోయారు విజయ్‌. ఒకప్పుడు విజయ్ సినిమా రిలీజ్‌ అవుతోందంటే.. కోలివుడ్‌లో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. రాజకీయరంగ ప్రవేశం చేస్తూనే సినిమాలకు గుడ్‌బై చెప్పిన విజయ్‌.. చివరి సినిమా జననాయగన్‌తో సిల్వర్‌ స్క్రీన్‌ని చించేద్దామనుకున్నారు. పొలిటికల్‌గానూ మైలేజ్‌ గెయిన్‌ చేయాలనుకున్నారు. కానీ, దానికి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. సెన్సార్‌ బోర్డు చెక్‌ పెట్టేసింది. దీంతో, జననాయగన్‌ విడుదలే కన్ఫ్యూజన్‌గా మారింది. ప్రత్యేక సెన్సార్‌ స్క్రీనింగ్‌ మరోసారి వాయిదా పడి, మార్చి 17కు రీ షెడ్యూల్‌ కావడంతో.. ఇప్పుడీ సినిమా విడుదలవడమే సస్పెన్స్‌గా మారింది.

41మంది ప్రాణంపోవడానికి కారణమైన కరూర్‌ తొక్కిసలాట ఘటన కూడా… విజయ్‌కే కాదు, ఆయన పార్టీకి కూడా రాచపుండులా తయారైంది. ఈ కేసు విచారణలో CBI స్పీడు పెంచింది. ఇప్పటికే ఆయనను రెండుసార్లు విచారించిన దర్యాప్తు సంస్థ… మరోసారి విచారణకు హాజరు కావాలంటూ.. విజయ్‌కి నోటీసులు ఇచ్చింది. దీంతో, తమిళ రాజకీయాల్లో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ఇష్యూలో ప్రత్యర్థులు విజయ్‌పై ముప్పేట దాడి చేస్తున్న వేళ… సీబీఐ మరింత స్పీడు పెంచడం కీలకంగా మారింది. అయితే, దర్యాప్తు సంస్థ నోటీసులపై స్పందించిన విజయ్‌.. 10రోజులు సమయం కావాలని అడిగినట్టు తెలుస్తోంది. దీంతో… తదుపరి విచారణ ఎప్పుడనే దానిపై… ఉత్కంఠ ఏర్పడింది!

ఇంటగెలిచి రచ్చగెలవాలనే పెద్దల మాట… ఇప్పుడు విజయ్ విషయంలో కీలకంగా మారింది. అన్నీ ఒకెత్తయితే.. తన ఫ్యామిలీ నుంచి ఎదురవుతున్న పాట్లు అంతకంతకూ పెరుగుతున్నాయ్‌. విజయ్‌తో విడాకులు కావాలంటూ.. ఇప్పటికే చెంగల్‌పట్టు కోర్టులో పిటిషన్‌ వేసిన భార్య సంగీత… ఇటీవల మరో అనుబంధ పిటిషన్‌ వేశారు. తనను విజయ్‌ ఇంట్లో ఉండనివ్వాలన్న సంగీత… న్యాయపరమైన భరణం ఇప్పించాలంటూ కోర్టును అభ్యర్థించారు. ఓ నటితో సన్నిహితంగా ఉంటూ.. కుటుంబాన్ని విజయ్‌ పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగీత… మరో అనుబంధ పిటిషన్‌ని కూడా దాఖలు చేయడం… తలపతిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. కుటుంబం విచ్చిన్నమై.. ఒక్కొక్కరు ఒక్కో చోట అన్నట్టుగా మారింది విజయ్‌ పరిస్థితి. మరి, బీస్ట్‌ రోస్ట్‌లా మారిన పరిస్థితులను… విజయ్‌ ఎలా అధిగమిస్తారన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us