AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. కేంద్రం–రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలపై ప్రభావం తగ్గించే దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ..

PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు
PM Modi chairs CCS meeting
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2026 | 8:44 PM

Share

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా ఇంధన–ఆహార సరఫరాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక వేదిక అయిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. యుద్ధ పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించి, భవిష్యత్ చర్యలపై చర్చలు జరిగాయి.

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడటం, ఇంధన భద్రతను నిర్ధారించడం, ప్రజల ప్రయోజనాలను రక్షించడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో దేశ సిద్ధతపై సమీక్ష జరిపారు.

ఈ సమావేశంలో కేంద్రం–రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు అమలయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రాలు కేంద్రంతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, నేలస్థాయిలో నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని తెలిపారు.

ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వాటిని దాచిపెట్టి ధరలు పెంచే చర్యలను కఠినంగా అరికట్టాలని రాష్ట్రాలకు సూచించారు. సరఫరా వ్యవస్థలు సజావుగా నడవడం కీలకమని పేర్కొన్నారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంపై కూడా దృష్టి సారిస్తూ, ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అపోహలు వ్యాప్తి చెందకుండా నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రధాని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల భయాందోళనలు పెరగవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను సూచించారు.

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రులు అభినందించారు. మొత్తం మీద, ఈ సమావేశంలో ప్రజలపై ప్రభావం తగ్గించే దిశగా సమన్వయంతో పనిచేయడం, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం, సరఫరా వ్యవస్థలను కాపాడడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమ ఆసియా ఘర్షణలపై ఇది రెండోసారి నిర్వహించిన సీసీఎస్ సమావేశం. మార్చి 22న జరిగిన తొలి సమీక్షలో కూడా ఇదే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా దేశంలో అవసరమైన సరఫరాలు హారం, ఇంధనం, గ్యాస్ లాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని ప్రధాని స్పష్టం చేశారు. పంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో, భారత్ అవసరమైన ఇంధనాన్ని పలు దేశాల నుంచి సమీకరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో వచ్చే అంతరాయాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులను సవాలుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేస్తూ, అపోహలు వ్యాప్తి చేస్తే దేశానికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. మొత్తంగా, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న వేళ, భారత్ ముందస్తు చర్యలతో పరిస్థితిని ఎదుర్కొనే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రజలపై ప్రభావం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Follow Us