వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!
దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ.. అంటే ఇన్‌ఫ్లుయెంజా (Influenza virus) H1N1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీలో 1,344 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం వైద్య వర్గాలను అప్రమత్తం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి నమోదైన 229 కేసులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ.. అంటే ఇన్‌ఫ్లుయెంజా (Influenza virus) H1N1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీలో 1,344 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం వైద్య వర్గాలను అప్రమత్తం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి నమోదైన 229 కేసులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
ఎందుకు పెరుగుతున్నాయి H1N1 కేసులు?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడటం వంటి కారణాలు సీజనల్ ఫ్లూ కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ గత వార్షిక నివేదికలో కూడా H1N1 ప్రస్తుతం సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా తరహాలో ప్రవర్తిస్తోందని, ఏడాది పొడవునా కేసులు కనిపించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని కొన్ని ఆసుపత్రుల్లో ఫ్లూ లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పిల్లల్లో లక్షణాలు ఎక్కువకాలం కొనసాగడం, కొంతమందికి కోలుకోవడానికి సమయం పట్టడం వంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
H1N1 లక్షణాలు ఏంటి?
స్వైన్ ఫ్లూ సాధారణంగా అకస్మాత్తుగా వచ్చే జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో మొదలవుతుంది. ఇవి సాధారణ వైరల్ ఫీవర్ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో పోలి ఉండటంతో కేవలం లక్షణాలను చూసి H1N1 అని నిర్ధారించుకోవడం సాధ్యం కాదు.
ముఖ్యంగా జ్వరం, దగ్గు తగ్గకుండా కొనసాగితే స్వయంగా మందులు వేసుకోవడం కంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. H1N1 వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో యాంటీబయాటిక్స్ సాధారణంగా వైరస్‌పై పనిచేయవు. అవసరమైన సందర్భాల్లో వైద్యులు ఓసెల్టామివిర్ వంటి యాంటీవైరల్ మందులను సూచించవచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
ఆరోగ్యంగా ఉన్న చాలామంది స్వైన్ ఫ్లూ నుంచి సరైన విశ్రాంతి, ద్రవాలు, వైద్యుల సూచనలతో కోలుకుంటారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వర్గాలకు చెందిన వ్యక్తుల్లో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం కీలకం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం
సాధారణ ఫ్లూ లక్షణాలతో పోలిస్తే పరిస్థితి తీవ్రంగా మారుతున్నట్లు అనిపిస్తే ప్రత్యేక జాగ్రత్త అవసరం. జ్వరం తగ్గకుండా కొనసాగడం లేదా మరింత పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో అసౌకర్యం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, తీవ్రమైన బలహీనత, అసాధారణ నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ముందుగా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో పరిస్థితి వేగంగా దిగజారే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకూడదు.
నివారణే ప్రధాన ఆయుధం
H1N1 వ్యాప్తిని తగ్గించేందుకు చేతులను సబ్బుతో తరచుగా శుభ్రం చేసుకోవడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం, రద్దీ ప్రదేశాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఉపయోగపడే నివారణ చర్యగా వైద్యుల సలహాతో పరిగణించవచ్చు.
మొత్తంగా ఢిల్లీలో H1N1 కేసుల పెరుగుదల ప్రజలు భయపడాల్సిన పరిస్థితి కంటే అప్రమత్తంగా ఉండాల్సిన సంకేతంగా చూడాలి. ప్రతి జ్వరం స్వైన్ ఫ్లూ కాదు.. అదే సమయంలో తీవ్రమైన లక్షణాలను సాధారణ జ్వరంగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. లక్షణాలను గుర్తించడం, అవసరమైతే పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో వైద్య చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
