AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు హెచ్చరికలు.. మొజ్తబా ఖమేనీ రాకతో మారుతున్న సమీకరణాలు!

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు అగ్రరాజ్యం హెచ్చరికలు.. వీటన్నింటి మధ్య ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్‌ వచ్చాడు! అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ.. ఇజ్రాయెల్ క్షిపణులకు సవాల్ విసురుతూ.. ఇరాన్‌ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతు తెలిపింది. ఖమేనీ వారసుడు రాకతో పశ్చిమాసియా రణరంగంలో మారిన సమీకరణాలేంటి? యుద్ధం ముగుస్తుందా.. లేక ముదురుతుందా?

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు హెచ్చరికలు.. మొజ్తబా ఖమేనీ రాకతో మారుతున్న సమీకరణాలు!
Iran Supreme Leader Mojtaba Khamenei
Balaraju Goud
|

Updated on: Mar 10, 2026 | 8:08 AM

Share

ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్‌ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఇరాన్‌లోని 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీకి మద్దతుగా వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు మొజ్తాబా ఖమేనీకి మద్దతుగా ఇరాన్‌లో సభలు ప్లాన్‌ చేస్తోంది అక్కడి యంత్రాంగం. ఇరాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహించే సభలకు ప్రజలు హాజరుకావాలని మెసేజ్‌లు పంపించారు. అయితే ఈ సభలకు భద్రతా కారణాల దృష్ట్యా మొజ్తాబా నేరుగా హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఇరాన్‌కు రష్యా మద్దతు తెలిపింది. కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీకి అభినందనలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. తన తండ్రి ఖమేనీ స్థానంలో వచ్చిన మొజ్తాబా ఇరాన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తాడని నమ్ముతున్నట్లు పుతిన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి.. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్‌ హామీ ఇచ్చారు.

అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్ మాత్రం మొజ్తాబా ఖమేనీపై నిప్పులు చెరిగారు. ఇరాన్‌లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మొజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్​ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలన్నారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ట్రంప్‌ హెచ్చరించారు. ఇటు ఇజ్రాయెల్‌ కూడా మోజ్తాబాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసింది.

మరోవైపు సుప్రీం లీడర్‌ నియామకం జరిగిన వెంటనే ఇరాన్ యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది. దేశ ప్రయోజనాలకు గండికొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని అటార్నీ జనరల్ కార్యాలయం హెచ్చరించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ ఇరాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పే వారికి వార్నింగ్ ఇచ్చింది. శత్రు దేశాలతో చేతులు కలిపినా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఇరాన్‌లో ఉన్న ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. మొత్తంగా మొజ్తాబా ఖమేనీ రాకతో పశ్చిమాసియా సమీకరణాలు మారుతున్నాయి. అటు రష్యా మద్దతు, ఇటు అమెరికా హెచ్చరికలతో యుద్ధం ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us