Khammam: ఈ పార్క్‌లో లవర్స్‌కు ఎంట్రీ లేదు
ఏ పార్కులో చూసిన ఏమున్నది గొప్ప విషయం.. సమస్తం ప్రేమ పక్షుల నిలయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. తెలంగాణలోని నగరాల్లో బోలెడన్ని పార్కులు ఉన్నాయి. అయితే ఆ పార్కులన్నీ ప్రేమ జంటల కోసమే ఏర్పాటు చేసినట్లుగా తయారైంది పరిస్థితి.

మామూలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులలోకి అందరికీ అనుమతి ఉంటుంది. కానీ ఖమ్మంలో ఉన్న ఓ పార్క్‌లోకి మాత్రం ప్రేమికులకు అనుమతి లేదు. అవును మీరు చదివింది నిజమే.. ఖమ్మంలోని తెలంగాణ ఫ్రీడం పార్క్‌లోకి లవర్స్‌కి అనుమతి లేదని ఖమ్మం మున్సిపల్ సిబ్బంది బోర్డులు రాసి పెట్టారు. ఖమ్మం నగరంలోని 53 వ డివిజన్‌లో ఉన్న తెలంగాణ ఫ్రీడం పార్క్‌లోకి ప్రేమికులను అనుమతించడం లేదు. సాయంత్రం అయితే పార్క్‌లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయనే ఫిర్యాదులు రావడముతో ఖమ్మం మున్సిపల్ సిబ్బంది ఈ విధంగా బోర్డులు రాసి పెట్టారు. లవర్స్ తో పాటు పార్క్‌లోని ఊయల కూడా కేవలం చిన్న పిల్లలకే అని అది కూడా 6 వ తరగతి లోపు పిల్లలే ఉగాలనే నిబంధన పెట్టారు. సిగరెట్‌లు కూడా ఈ పార్క్‌లో తాగరాదు. అంబర్, గుట్కా లాంటివి కూడా ఈ పార్క్‌లో వేసుకోరాదని సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు.
ఎక్కడైనా పార్క్‌లో చెత్తా చెదారం పడేయొద్దనే సూచనలతో బోర్డులు చూస్తుంటాం. కానీ ఈ పార్కు వద్ద ఏర్పాటుచేసిన బోర్డు గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బోర్డుపై సైకిళ్లు పార్క్ లోపలికి తీసుకురావొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత క్రికెట్ ఆడొద్దనేవి రెండు సూచనలు ఉన్నాయి. ఇక మూడోది మాత్రం ‘లవర్స్ కు అనుమతి లేదు’ అని రాశారు. గంటల తరబడి పార్కులో కూర్చుంటున్న కొన్ని జంటలు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు వస్తుండడంతోనే ఇలా బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
ఖమ్మంలో ఉన్న అన్ని పార్కులు వేరని ఈ పార్కు వేరంటున్నారు అక్కడి సిబ్బంది. పక్కాగా నియమ నిబంధనలు పాటించాల్సిందే అంటున్నారు. పిల్లలు కానీ, పెద్దవారు కానీ సైకిల్‌ను పార్క్ లోపలికి తీసుకరావద్దని, పిల్లలు ఎవరు కూడా సాయంత్రం 4 గంటలు తరువాత క్రికెట్ ఆడవద్దనే నిబంధనలు పెట్టారు. మిగితా కండిషన్లు బాగానే ఉన్నా ఈ లవర్స్ కి అనుమతి లేకపోవడం ఏమిటా అని ఆలోచనలో పడ్డారు యువతీ యువకులు. ఉదయం, సాయంత్రం ఈ పార్క్ లో వాకింగ్ చేసేందుకు స్థానికంగా ఉన్న మహిళలు, పురుషులు వస్తుంటారు. ఆ సమయంలో లవర్స్ కూడా వచ్చి.. ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉండటంతో… వాకింగ్ చేసే వాళ్లకు కొంత ఇబ్బందికరంగా ఉందంటున్నారు సిబ్బంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




