చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న లింకేంటీ..?
Heart Health: చలికాలంలో గుండెపోటు ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో రక్తనాళాలు సన్నబడటం, ఒత్తిడి హార్మోన్లు పెరగడం దీనికి కారణం. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. వెచ్చగా ఉండటం, ఇంటి లోపలే వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. చలికాలం కేవలం జలుబు, దగ్గునే కాదు.. ప్రాణాంతకమైన గుండెపోటు ముప్పును కూడా తెస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున లేదా ఉదయం వేళల్లోనే ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
ఉదయం పూటే ఎందుకు ప్రమాదం?
ఢిల్లీలోని మూల్చంద్ మెడిసిటీ హాస్పిటల్ కార్డియాలజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ కుమార్.. ఉదయం వేళల్లో గుండెపోటు రావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు.. ఆయన ప్రకారం..
- చలి ఎక్కువగా ఉండటం వల్ల మన రక్త ధమనులు సన్నబడతాయి . దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
- ఉదయం నిద్రలేచే సమయంలో శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇవి హృదయ స్పందన రేటును, రక్తపోటును అకస్మాత్తుగా పెంచుతాయి.
- చలికాలంలో రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ధమనులలో కొవ్వు పేరుకుపోయిన వారికి, అధిక రక్తపోటు వల్ల ఆ ఫలకం పగిలి రక్తం గడ్డకట్టడం వల్ల తక్షణమే గుండెపోటు వస్తుంది.
ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?
కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ కుమార్ సూచిస్తున్నారు..
- అధిక రక్తపోటు ఉన్నవారు.
- మధుమేహం బాధితులు.
- అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు.
- వృద్ధులు, గతంలో గుండె సమస్యలు ఉన్నవారు.
గుండెపోటు లక్షణాలు: వీటిని విస్మరించకండి!
చాలామంది ఛాతీ నొప్పిని అసిడిటీగా భ్రమపడుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వండి..
- ఛాతీలో విపరీతమైన నొప్పి లేదా భారంగా అనిపించడం.
- ఛాతీ నొప్పి ఎడమ చేయి లేదా దవడ వైపు వ్యాపించడం.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
- అసిడిటీ మాత్రలు వేసుకున్నా తగ్గని అసౌకర్యం.
- అకస్మాత్తుగా చెమటలు పట్టడం, వికారం.
నివారణ మార్గాలు
వెచ్చగా ఉండండి: బయట చలి గాలికి నేరుగా వెళ్లకండి. తగినన్ని ఉన్ని దుస్తులు ధరించి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి.
ఇంటి లోపలే వ్యాయామం: విపరీతమైన చలి ఉన్నప్పుడు ఉదయాన్నే పార్కులకు వెళ్లకుండా, ఇంటి లోపలే తేలికపాటి వ్యాయామాలు చేయండి.
ఆహార నియమాలు: పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు తీసుకోండి. ఉప్పు మరియు కొవ్వు పదార్థాలను తగ్గించండి.
నిరంతర పర్యవేక్షణ: రక్తపోటు, షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




