Telangana: ప్రతి గింజా కొంటాం.. సరిహద్దుల్లో చెక్ పోస్టులు.. రైతుల సంక్షేమమే ముఖ్యం.. మంత్రి గంగుల
2022 - 23 వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులకు మంత్రి గంగుల వానకాలం ధాన్యం సేకరణపై దిశానిర్దేశం చేశారు....

2022 – 23 వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులకు మంత్రి గంగుల వానకాలం ధాన్యం సేకరణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, ఇంచు భూమి పెరగకుండా 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి దేశంలోనే రెండో స్థానంతో ప్రపంచానికే అన్నం పెట్టేలా కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు. సంపద పెంచాలి. దాన్ని పేదలకు పంచాలి. అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని, సాగు రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ ప్రభుత్వం ఇందులో విజయం సాధించిందన్నారు.
వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో గతం కన్నా 3 లక్షల ఎకరాలు పెరిగి, దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఇందులో సొంత వాడకానికి, ఇతరత్రా అమ్మకాలకు పోను దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుందని వివరించారు. గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ఒక్క గింజ ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేయాలి. ఒక్క గింజ రేషన్ బియ్యం కూడా రీ సైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మిల్లర్ల వద్ద ఉన్న దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లింగ్ చేయాలి. దానిని సీఎంఆర్ అప్పగిస్తూ తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టర్ గా ఏఈఓ లు ఇచ్చిన సమాచారం ఆన్లైన్ చేశామని, సర్వే నెంబర్ల వారీగా ఏ భూమిలో ఏ రకమైన పంట సాగయిందో ఆ వివరాలు సైతం ప్రస్తుతం డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచాం. కాబట్టి పంటభూమి లేకుండా ధాన్యం అమ్మడానికి అవకాశం లేదు. ప్రజాధనం ఒక్క రూపాయి వృథా కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి.




– గంగుల కమలాకర్, తెలంగాణ మంత్రి
కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు రైతులు సైతం సహకరించాలని కోరారు. ఎఫ్సీఐ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీని కచ్చితంగా మెయింటైన్ చేస్తున్నందున రైతులు సైతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఎఫ్ఎక్యూ ప్రమాణాలతో తీసుకొని రావాలని సూచించారు మంత్రి గంగుల. ఈ విధంగా రైతులకు అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.