Telangana: ‘వామ్మో.. ఇదేం నీరు సారూ!’ బండ్లగూడలో కలుషిత నీటి కలకలం..
ఇటీవల రూ.6 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బండ్లగూడ కార్పొరేషన్ ఫిల్టర్ బెడ్ల పని తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని ఏడాది కూడా కాకముందే అప్పుడే పడకేశాయి. గత 20 రోజులుగా మురికి నీరు సరఫరా అవుతుంటే పట్టించుకునే నాథుడేలేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

బండ్లగూడ, మార్చి 27: రాష్ట్రంలో కలుషిత నీటి సరఫరా మరోమారు కలకలం సృష్టించింది. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో ఈ మేరకు కలుషిత నీరు సరఫరా అవుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్భాటంగా ప్రారంభించిన ఫిల్టర్ బెడ్ల నుంచి మురికి నీరు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బండ్లగూడకు సరఫరా అయ్యేనీరు హిమాయత్ సాగర్ నుంచి వస్తుంది. ఈ నీటిని శుద్ధిచేసి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హిమాయత్ సాగర్ వద్ద ఇటీవల రూ.6 కోట్ల ఖర్చుతో ఐదు ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసింది. దీంతో మంచినీటి కష్టాలు తీరాయని అందరూ అనుకుంటున్న తరుణంగా గత 20 రోజులుగా మళ్లీ మురుగు నీరు రావడం చర్చణీయాంశంగా మారింది.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ నుంచి పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితంగా వస్తున్నట్లు బుధవారం ఉదయం హిమాయత్ సాగర్ గ్రామస్తులు జలమండలి అధికారి గోవింద్‌కి ఫిర్యాదు చేశారు. కలుషిత నీళ్లు తాగితే రోగాలు ప్రభలుతాయని, తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్లను మరోసారి తనిఖీ చేసి నీటిని శుభ్రపరచాలని డిమాండ్ చేశారు. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు గ్రామాలకు పంపిణీ చేస్తున్న మంచినీటిని పూర్తిస్థాయిలో ఫిల్టర్ చేయాలని, అధికారులు సత్వర చర్యలు తీసుకొని కలుషిత నీరు రాకుండా చూడాలని కోరారు.
దీనిపై జలమండలి అధికారిక స్పందిస్తూ.. ఏదైనా పని జరుగుతుంటే మాత్రం మట్టి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుందని జలమండలి అధికారి గోవింద్ గౌడ్ పేర్కొన్నాడు. కాగా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు గ్రామాలకు హిమాయత్ సాగర్ జలాశయం నుంచి నిత్యం లక్ష 20 వేల లీటర్ల నీటిని ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.