2026: బరువు తగ్గాలనుకుంటే ఈ తప్పులు చేయకండి!
కొత్త సంవత్సరం 2026లో తమ శరీర బరువును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆహార నియమాలను పాటించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే మంచిది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడానికి బదులు.. కొద్ది మొత్తంలో పలుమార్లు తీసుకుంటే మంచిది. రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకోవద్దు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

మరి కొద్ది గంటల్లో 2026లో అడుగుపెడుతున్న సందర్భంగా చాలా మంది కొత్త సంవత్సరంలో అమలు చేయాల్సిన పనుల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో చేయలేని పనులను పూర్తి చేయాలని, కొత్త పనులు ప్రారంభించాలని తీర్మానించుకుంటూ ఉంటారు. చాలా మంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాదిలో నాజుగ్గా తయారు కావాలని అనుకుంటారు. అయితే, బరువు తగ్గడానికి వ్యాయామంతోపాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గేందుకు చాలా మంది ఆహారం తీసుకోవడం మానేస్తూ ఉంటారు. అలా చేయకూడదంటారు ఆరోగ్య నిపుణులు. మీరు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెబతారు. కొవ్వును తగ్గించేందుకు కొన్ని నియమాలను పాటించడం ముఖ్యం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా తరచుగా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం
బరువు తగ్గాలంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే మంచిది. రోజూ నిర్దిష్ట సమయంలో వ్యాయామం చేయాలి. ఇక, రాత్రిపూట భోజనంలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. ఇది అజీర్ణానికి కారణమవుతుంది. అంతేగాక, రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
తప్పనిసరి సందర్భాల్లో తప్ప రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే అలవాటును మానుకోండి. రాత్రి ఆలస్యం వల్ల మళ్లీ ఆకలి వేసే అవకాశం ఉంది. ఆకలి భావన అతిగా తినేందుకు కారణమవుతుంది. ఇది మళ్లీ మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. నూనె జిడ్డు, కారంగా ఉండే ఆహారాలు, వేయించిన ఆహారాలు, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉంటే మీరు బరువు తగ్గాలనుకునే ప్రయత్నం ముందుకు సాగుతుంది. ఇంట్లో వండిన సాధారణ భోజనం మాత్రమే తీసుకోవడం మంచిది.
క్రాష్ డైట్ వద్దు
శరీర బరువు తగ్గించుకోవడంలో కీలకమైన విషయం చక్కెర పదార్థాలను దూరం పెట్టడం. తీపి పదార్థాలను తీసుకోకపోవడం వల్ల మీ శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. అయితే, ఎప్పుడూ క్రాష్ డైట్ పాటించవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే అకస్మాత్తుగా ప్రతీది తినడం మానేయడం. ఇది శరీరంలోని అనేక విషయాలలో లోపాలకు దారితీసే అవకాశం ఉంది. అంతేగాక, కొవ్వును తగ్గించేందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే, శరీర సామర్థ్యానికి మించి చేయొద్దు. దీని వల్ల శరీరంపై అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంది.