AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBL History : సిక్సర్ల కింగ్ విధ్వంసం.. 4000 పరుగులతో వరల్డ్ రికార్డు.. బిగ్ బాష్ లీగ్‌లో నంబర్ 1 వీడే

Chris Lynn : ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ క్రిస్ లిన్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. 2025 ముగింపు వేళ బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బరిలోకి దిగిన లిన్.. కేవలం 41 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

BBL History : సిక్సర్ల కింగ్ విధ్వంసం.. 4000 పరుగులతో వరల్డ్ రికార్డు.. బిగ్ బాష్ లీగ్‌లో నంబర్ 1 వీడే
Chris Lynn
Rakesh
|

Updated on: Dec 31, 2025 | 7:45 PM

Share

BBL History : ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ క్రిస్ లిన్ బిగ్ బాష్ లీగ్‎లో తన ప్రతాపాన్ని మరోసారి చూపించాడు. 2025 సంవత్సరం ముగింపు వేళ ఆస్ట్రేలియా గడ్డపై సిక్సర్ల సునామీ సృష్టించి అభిమానులకు అదిరిపోయే విందును అందించాడు. బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బరిలోకి దిగిన లిన్.. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ మాథ్యూ షార్ట్ పరుగులు చేయడానికి తడబడగా, క్రిస్ లిన్ మాత్రం క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బంతిని బౌండరీల అవతలికి పంపడం మొదలుపెట్టాడు. కేవలం 41 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన లిన్ ధాటికి, 122 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ జట్టు మరో 35 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది. నాలుగో ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా లిన్ బాదిన సిక్సర్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా క్రిస్ లిన్ బిగ్ బాష్ లీగ్‌లో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 131 మ్యాచ్‌ల్లో 4065 పరుగులు చేసిన లిన్, ఈ లీగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, బీబీఎల్ చరిత్రలో 200 కంటే ఎక్కువ సిక్సర్లు (226) కొట్టిన ఏకైక ఆటగాడు కూడా ఇతనే. 151 సిక్సర్లతో గ్లెన్ మాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నాడంటే, లిన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లిన్ గతంలో ఐపీఎల్‌లో కూడా 42 మ్యాచ్‌ల్లో 1329 పరుగులు చేసి సత్తా చాటాడు.

లీగ్ క్రికెట్‌లో ఇంతటి ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, క్రిస్ లిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా తరపున 18 టీ20లు ఆడి కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అలాగే 4 వన్డేల్లో 75 పరుగులు చేశాడు. గాయాలు, నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో ఎక్కువ కాలం ఉండలేకపోయినప్పటికీ, టీ20 ఫ్రాంచైజీ లీగ్స్‌లో మాత్రం లిన్ ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ బ్యాటర్ గానే కొనసాగుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..