AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak : ‘ఓడినంత మాత్రాన ఏం కాలేదు.. మా సత్తా ఏంటో మున్ముందు చూపిస్తాం’..ఇంకా పాక్ వాళ్లకు బుద్ధిరాలేదు

Ind Vs Pak : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) టీమిండియాతో జరిగిన హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బ్యాటర్ల ధాటికి 61 పరుగుల తేడాతో చిత్తయిన పాక్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ind Vs Pak : ‘ఓడినంత మాత్రాన ఏం కాలేదు.. మా సత్తా ఏంటో మున్ముందు చూపిస్తాం’..ఇంకా పాక్ వాళ్లకు బుద్ధిరాలేదు
Usman Tariq
Rakesh
|

Updated on: Feb 17, 2026 | 8:00 PM

Share

Ind Vs Pak : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) టీమిండియాతో జరిగిన హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బ్యాటర్ల ధాటికి 61 పరుగుల తేడాతో చిత్తయిన పాక్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఓటమి తమపై ఎలాంటి ఒత్తిడిని కలిగించడం లేదని ఆ జట్టు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు (ఫిబ్రవరి 18) నమీబియాతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

భారత్‌తో మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని వస్తున్న వార్తలను ఉస్మాన్ తారిక్ కొట్టిపారేశారు. “ఒత్తిడి అనేది సహజం, కానీ అది బయటి వ్యక్తుల అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాల వల్ల మాత్రమే ఏర్పడుతుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. భారత్‌తో మ్యాచ్‌లో ఎక్కడ తప్పులు చేశాం? ఎక్కడ ప్రణాళికలు విఫలమయ్యాయి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఆ తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని నిర్ణయించుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక మ్యాచ్ ఫలితం తమ సామర్థ్యాన్ని నిర్ణయించదని ఉస్మాన్ ధీమా వ్యక్తం చేశారు.

భారత్‌తో మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీలను నమీబియాతో మ్యాచ్ నుంచి తప్పిస్తారనే ప్రచారంపై ఉస్మాన్ స్పందించారు. “బాబర్, షాహీన్ ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. కేవలం ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయడం సరికాదు. సీనియర్ ప్లేయర్లుగా వారికి ఎలా పుంజుకోవాలో బాగా తెలుసు” అని వారిద్దరికీ మద్దతుగా నిలిచారు. అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ తీవ్రంగా శ్రమించడం చూస్తుంటే, తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్-ఏలో పాకిస్థాన్ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత్ ఇప్పటికే 6 పాయింట్లతో సూపర్-8కు చేరుకోగా, రెండో స్థానం కోసం పాక్, అమెరికా పోటీ పడుతున్నాయి. నమీబియాతో జరుగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా పాక్ 5 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. నమీబియా చేతిలో పాక్ ఓడిపోతే, మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న అమెరికా సూపర్-8కు అర్హత సాధిస్తుంది.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ అద్భుతమైన బౌలింగ్‌తో సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయారు. ఇప్పుడు నమీబియాతో మ్యాచ్‌లో తన పాజ్-అండ్-స్లింగ్ యాక్షన్‌తో మ్యాజిక్ చేసి పాక్‌ను సూపర్-8కు చేర్చాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us