ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..
చైనా మాంజాతో ఇబ్బందులు లేకుండా సేఫ్టీ రాడ్లను పంపిణీ చేశారు పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో చైనా మాంజాతో పతంగులు ఎగరేయడం వల్ల.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీకలు తెగి చనిపోయే పరిస్థితి ఎదురవుతోంది. చాలామందికి తీవ్రగాయాలు అవుతున్నాయి. చైనా మాంజా పక్షులకైతే మృత్యువలయంగా మారుతోంది.

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు, ముఖ్యంగా మెడ భాగంలో చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలపాలవుతున్న ఘటనలు గతంలోనూ నమోదయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ చార్మినార్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనదారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా సేఫ్టీ రాడ్లను పంపిణీ చేస్తూ, చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మెడను రక్షించే విధంగా అమర్చుకునే ఈ సేఫ్టీ రాడ్లు ప్రమాదాల తీవ్రతను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. పాతబస్తీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనదారులు వీటిని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.
అదేవిధంగా ఫలక్‌నుమా పోలీసులు చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గాలిపటాల పండుగ సమయంలో పిల్లలు చైనా మాంజా వినియోగించకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు గాలి పటాలను పంపిణీ చేస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. చైనా మాంజా వాడటం చట్టరీత్యా నేరమని, దీని వల్ల మనుషులకే కాకుండా పక్షులు, జంతువులు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. సురక్షితమైన నూలు, పర్యావరణానికి హానికరం కాని మాంజానే ఉపయోగించాలని సూచించారు.
వీడియో చూడండి..
చైనా మాంజా వాడకం పూర్తిగా ఆపివేయాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని పోలీసులు తెలిపారు. నిషేధిత మాంజాను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగల ఆనందం ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
