Cyber Crimes: సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక.. ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దంటూ వార్నింగ్!
ప్రతి ఒక్కరి చేతిలో టచ్ ఫోన్ రావడంతో సైబర్ నేరగాళ్ల నేరాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. నిత్యం ఎందరో అమాయకులను ఏమార్చి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కొందరికి ఇదంతా సైబర్ నేరగాళ్ల కనికట్టనే విషయం తెలియక సులువుగా మోసపోతున్నారు. దీంతో సైబర్ పోలీసులు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు..
హైదరాబాద్, నవంబర్ 12: సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు హెచ్చరిక జారీ చేశారు. వ్యక్తిగత సమాచారం – చిరునామా, లొకేషన్, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేది, ఇతర వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోకుండా ఉండాలని కోరారు. సైబర్ మోసగాళ్ళు విభిన్న మార్గాలలో ప్రజలను మోసగించడానికి కొత్త పద్ధతులతో వస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. “ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు, జాగ్రత్తగా ఉండండి; కాల్ కట్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేయండి. కాల్ సమయంలో ఏ నంబర్ ప్రెస్ చేయకండి; వారి మాటలు విని ఆందోళన చెందవద్దు. కేవలం కాల్ కట్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేయండి” అని పోలీసులు తెలిపారు.
TRAI మీ ఫోన్ డిస్కనెక్ట్ చేయబోతుందని అంటూ కాల్ చేస్తే.. స్పందించవద్దు. అది స్కామ్. FedEx నుంచి ప్యాకేజ్ వస్తుందని, 1 నొక్కమని చెబితే, స్పందించవద్దు. అది కూడా స్కామే. పోలీసు ఆఫీసర్ అంటూ ఆధార్ కోసం మాట్లాడితే, స్పందించవద్దు.. అది స్కామ్. మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారని ఎవరైనా చెబితే, స్పందించవద్దు.. అది స్కామ్. మీ పేరుతో ఉన్న ప్యాకేజ్‌లో డ్రగ్స్ కనుగొన్నామని చెబితే, స్పందించవద్దు. అది స్కామ్. ఇలాంటి కాల్స్ వస్తే స్పందించవద్దు. వారిపై నమ్మకం పెట్టుకోవద్దు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు 1930లో తెలపండి. అలాగే వాట్సాప్ లేదా SMS ద్వారా సంప్రదించినా స్పందించవద్దు. అది స్కామ్. మీ UPIకి తప్పుగా డబ్బులు పంపినట్లు చెబుతుంటారు. అది నిజం అనుకుని డబ్బు వెనక్కి పంపొద్దు. అది స్కామ్.
మరికొన్ని రకాల స్కామ్ కాల్స్..
- మీ కార్, వాషింగ్ మెషిన్ లేదా సోఫాను కొనాలని చెబితే వారి IDని కచ్చితంగా పరిశీలించండి. అదే ఆర్మీ లేదా CRPFనుంచి అని చెబితే కూడా స్పందించవద్దు.
- స్విగ్గీ లేదా జొమాటో నుంచి కాల్ వచ్చినట్లు, 1 ప్రెస్ చేయమని చెబితే, స్పందించవద్దు.. అది స్కామ్.
- మీ OTPను పంచాలని అడిగితే, ఇవ్వవద్దు.. అది స్కామ్.
- మీకు తెలియని నంబర్ నుండి వీడియో కాల్స్ వస్తే ఎత్తకండి.
- సందేహం ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేయండి.
- బ్లూ కలర్‌లో ఉన్న లింక్ మీద ఎప్పుడూ క్లిక్ చేయకండి.
- ఎలాంటి నోటీసు వచ్చినా, ఆఫ్లైన్‌లో తనిఖీ చేయండి.
- ఏ పత్రాలు వచ్చినా, నిజమైన ప్రభుత్వ పోర్టల్స్ నుండి వచ్చినవా? కాదా? అని విషయాన్ని పరిశీలించాలి.