KCR: మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తనను కలిసిన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. అన్ని రోజులు మనవి కావని.. కష్టాలను చూసి అధైర్యపడొద్దని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని సత్కరించారు. తాను సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని.. కొన్ని కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని తెలిపారు. అలాంటి వాటికి వెరవకూడదని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తాయన్నారు. అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడొద్దన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని గ్రామస్తులకు సూచించారు కేసీఆర్.
సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలన్నారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని పని చేయాలన్నారు. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావొద్దన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కేసీఆర్ వారికి వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
